calender_icon.png 21 October, 2024 | 5:09 AM

రామగుండం--మణుగూరు భూసేకరణ ప్రారంభం

21-10-2024 12:25:43 AM

కేంద్ర రైల్వే శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగింత

పెద్దపల్లి, అక్టోబర్ 20 (విజయ్‌క్రాంతి): రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచేందుకు కేంద్ర రైల్వే శాఖలోని పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, కమాన్‌పూర్, మం థని, (మంథని) ముత్తారం, భూపాలపల్లి జిల్లాలోని మలహర్‌రావు, తాడిచర్ల, కాపురం, ఘన్‌పూర్, భూపాలపల్లి మండలాల మీదుగా మేడారం నుంచి మణు గూరు వరకు 207.80 కిలోమీటర్ల మేర బ్రాండ్ గేజ్ రైల్వే పనులు చేపట్టేలా రైల్వే శాఖ నివేదిక తయారుచేసింది.

అయితే రైల్వే నిర్మాణానికి భూ సేకరణ చేసి రైతులకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించేందుకు రామగుండం కమలాపూర్ రామగిరి, మంథని, ముత్తారం, మండలాలకు పెద్దపెల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అప్పగించింది. భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల, మలహర్రావు, కాపురం, ఘనపూర్, మండలాలకు కాటారం, సబ్ కలెక్టర్, (ఆర్డీవో)కు బాధ్యతలు అప్పగించింది.

ఈ లైన్ పూర్తయితే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం సులువవుతుంది. పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లొచ్చు. ఈ క్రమం లో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. దీంతోపాటు ఈ జిల్లాల్లో పారిశ్రా మిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.