రాఘవపూర్ లో వర్క్ సైట్ స్కూల్ ప్రారంభోత్సవంలో రామగుండం సీపీ శ్రీనివాస్..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడం పోలీస్ ప్రధాన ధ్యేయమని వర్క్ సైట్ స్కూల్ పేరుతో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపూర్ లో పాఠశాల ప్రారంభోత్సవంలో రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్యను అందించాలని పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందని సిపి అన్నారు. ఇటుక బట్టీలలో పలక బలపం పట్టవల్సిన చీట్టి చేతులు ఇటుక బట్టీలలో తల్లితండ్రులతో కలిసి ఇటుకలను చేస్తూ, మోస్తున్న కార్మికుల పిల్లల పరిస్థితి తెలిసి బాధిస్తుందని, తాను ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి కార్మికుల బాగోవులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దని ఖచ్చితంగా వారికి విద్యాభ్యాసం కల్పించాల్సిందేనని ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వర్క్ సైట్ స్కూల్ కార్మికులు వారి పిల్లలకు క్లాస్ రూములను సద్వినియోగం అయ్యేలా చూడలన్నారు.
వలస కార్మికులు బతుకు దెరువు కోసం స్వరాష్ట్రం వదిలి వేలాది కిలోమీటర్ల దూరం వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారని, వారి పిల్లలు సైతం వారి చెంతనే ఉంటూ భవిష్యత్తు కార్మికులుగా మారుతున్నారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాలలు ప్రారంభించామన్నారు. పిల్లల భవిష్యత్తుకు చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఇక్కడ 70 మంది పిల్లలు ఉన్నారని, వాళ్లకి ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒరిస్సా భాషలో నేర్పించడానికి ఒరిస్సా నుంచి టీచర్లు కూడా ఏర్పాటు చేశామని, కమీషనరేట్ పరిదిలోని ఇటుక బట్టిలలో త్వరలో వర్క్ సైట్ స్కూల్ ఏర్పాటు చేసేలా చూస్తామని సిపి తెలిపారు. విద్యార్థులకు స్వయంగా పుస్తకాలు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. పిల్లలందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని సీపీ కోరారు.
పెద్దయ్యాక ఏమవుతారని పిల్లలను సిపి శ్రీనివాసులు అడగగా పిల్లలు పోలీస్ అని జవాబిచ్చారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నానని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, బసంత్ నగర్ ఎస్సై స్వామి తదితరులు పాల్గొన్నారు.