- వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ
- మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో ఏర్పాటు
రామగుండం, నవంబర్ 24: ఇప్పటివరకు మాంచెష్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండం త్వరలో మెడికల్ హబ్‌గా మారబోతున్నది. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి చొరవ, రామగుండం ఎమ్మెల్యే కృషితో త్వరలోనే నర్సింగ్ కళాశాల పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 60 మంది విద్యార్థులను కళాశాలలో చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి బోధన తరగతులు ప్రారంభం కానున్నాయి.
గతంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిగా ఉన్న రామగుండంలో సింగరేణి సంస్థ ద్వారా రూ.500 కోట్లతో 360 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. మరో రూ.140 కోట్లతో మరో 350 పడకల విభాగాన్ని ఐదో అంతస్తులో నిర్మిస్తున్నారు. మరో రూ.15 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
గత మార్చి నెలలోనే 350 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. మరో ఏడాదిలో భవనం పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ఆసుపత్రిలో రోజుకు 1,500 వరకు ఓపీ సేవలు నమోదవుతున్నాయి.
కార్పొరేట్ వైద్య సేవలు: మంత్రి శ్రీధర్‌బాబు
ఇప్పటివరకు అత్యవసర వైద్య సేవల కోసం హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పేదలు అంత దూరం వెళ్లి ఖరీదైన వైద్యం చేయించుకోలేక చాలా మంది చనిపోతున్నారు.
ఇక నుంచి పేదలకు కూడా స్థానికంగానే కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే నర్సింగ్ కళాశాలను సీఎంతో మాట్లాడి మంజూరు చేయించాం. రామగుండంను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎంతగానో కృషి చేస్తున్నారు.