25-02-2025 08:45:58 PM
ఖమ్మం (విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ మాసం ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు, చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్థ్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి మసీదు దగ్గర పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఏదైనా మసీదు దగ్గర త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏదైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని, త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని, రంజాన్ మాసం సందర్భంగా సమయానుకూలంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ... మసీదు పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.