31-03-2025 01:32:37 PM
ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు..
వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రంజాన్ పర్వదిన సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు.
మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్ జైపాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, కాంగ్రెస్ నాయకులు కట్ల రంగారావు, పెరుగు ప్రసాద్ ,పలువురు రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.