calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్.. మతసామరస్యానికి ప్రతీక

29-03-2025 12:00:00 AM

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, మార్చి -28 ( విజయక్రాంతి ):-పవిత్రమైన రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రంజాన్ వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో వ చ్చాక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

హిందువులు సైతం రంజాన్ వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి భేదాలు లేకుండా ప్రజలంతా కలిసి, మెలిసి ఉంటారని, భవిష్యత్తులో కూడా సోదర భావంతో అందరం కలిసి జీవించాలని అన్నారు. నూతన షాదీఖానా మత పెద్దల అభీష్టానం మేరకే నిర్మిస్తామని అన్నారు. 

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖర్జూర పండును స్వయంగా తినిపించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ముస్లిం మత పెద్దలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. బి. పురంధర్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.