01-03-2025 12:00:00 AM
‘సర్కస్ రాముడు’. 1980, మార్చి 1న విడుదలైన ఓ యాక్షన్ డ్రామా ఇది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కోవై చెజియన్ కేసీ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఎన్టీఆర్ ఇందులో రెండు పాత్ర ల్లో (రాము, రాజా) మెప్పించారు. కథన విషయానికొస్తే.. జమీందార్ కోటేశ్వరరావు (త్యాగరాజు), జానకీదేవి (సావిత్రి)ది రాజ కుటుంబం. కోటేశ్వ ర్రావు, జానకి కుటుంబ ఆస్తుల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే మోసపూరిత బుద్ధితో ఉంటాడు కోటేశ్వరరావు బావ మరిది భాస్కర్‌రావు (రావు గోపాల్‌రావు).
అయితే ఆ దంపతులకు చాలా కాలం తర్వాత పుట్టిన నవజాత శిశువును చంపడానికి కుట్ర పన్నుతాడు భాస్కర్‌రావు. అయితే ఓ సర్కస్ యజమాని చలపతిరావు (అల్లు రామలింగయ్య) ఆ బిడ్డను చాకచక్యంగా రక్షించి పెంచుతాడు. జానకి మళ్లీ రెండో బిడ్డకు జన్మనిస్తుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. ఇటు జానకి రెండో బిడ్డ అయిన రాజా (ఎన్టీఆర్) నిజాయితీపరుడైనందున భాస్కర్‌రావు చేతిలో దోపిడీకి గురవుతుంటాడు.
ఇదే క్రమంలో రాజాతో తన కుమార్తె జయ (జయప్రద) జతకట్టేలా చేస్తే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని భాస్కర్‌రావు ప్లాన్ వేస్తాడు. కానీ రాజా.. అంకమ్మ (సుజాత)తో ప్రేమలో పడతాడు. జమీందార్‌గా గౌరవం పొందుతున్న తన తండ్రి కోటేశ్వరరావుకు తెలియ కుండా అంకమ్మను పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు తన కూతురును కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడని తెలిసిన భాస్కర్‌రావు రాజాపై దాడి చేస్తాడు.
పెద్ద కుమారుడి జాడ తెలియక, చిన్న కుమారుడు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ద్వారా తన పరువు పోయిందన్న బాధతో మరణించటంతో ఆస్తి పొందటం భాస్కర్‌రావుకు ఈజీ అయ్యిందా? తన స్వార్థబుద్ధితో భాస్కర్‌రావు చివరకు సాధించిందేమిటి? ఇంత కాలం నిజాయితీగా ఉన్న రాజా తన ప్రేమపెళ్లిని వ్యతిరేకించిన తండ్రి పరువుపోయేలా ఎందుకు వ్యవహరించాడు?
ఆయనకు చెప్పకుండా అంకమ్మనే పెళ్లి చేసుకోవడా నికి గల బలమైన కారణం ఏమిటి? అసలు రాజా ప్రేమ, పెళ్లికి దారి తీసిన సందర్భం ఏమిటి? అందరికీ సర్కస్ రాముడుగా సుపరిచితుడైన రాముకు, జమీందార్ కుటుంబానికి సంబంధం ఏమిటి? భాస్కర్‌రావు పైశాచికత్వాన్ని అతనికి చెప్పిందెవరు? రాము రాజభవనంలోకి ఎంట్రీ ఇచ్చి భాస్కర్‌రావును ఎలా ప్రతిఘటించాడు? రాజాపై మనసుపడ్డ జయ ఎవరితో పెళ్లి పీటలెక్కిం ది? అనే ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిందీ సినిమా.