బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జైభీమ్’ చెబుతారని కేసీఆర్ ముందే చెప్పారని, ఇప్పుడు అదే నిజమైందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహిం చిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు పంటలకు కాదు, మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ ముష్టి రూ.10 వేలు ఇస్తున్నాడు.. మేము అధికారంలో వస్తే రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చావు కబురు చల్లగా చెప్పారని అన్నారు.
ఫార్మా సిటీ, ఫోర్త్‌సిటీలపై సీఎం రేవంత్‌రెడ్డి అన్ని దొంగమాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇదే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి వంటి వారితోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని.. ఈ చిట్టినాయుడు రేవంత్ ఎంత?.. చిట్టినాయుడుకి ఏం తెలియదు.. తిట్టమంటే మాత్రం తిడతాడని ఎద్దేవా చేశారు. మేము చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగానే బీఆర్‌ఎస్ ఓడిపోయిందని, ఒక్కోసారి ఓటమి కూడా మంచికేనని కేటీఆర్ అన్నారు.
కాగా, దసరా సమ్మేళనానికి ముందు బొంగ్లూరు వద్ద సాగర్ రహదారిపై సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.