calender_icon.png 24 September, 2024 | 10:07 PM

రాముని చెరువు శిఖం ఖతం!

06-09-2024 12:49:51 AM

  1. దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు
  2. బఫర్ జోన్‌లోనే విచ్చలవిడి నిర్మాణాలు
  3. కళ్లుండీ చూడలేకపోతున్న అధికారులు 
  4. యంత్రాంగం తీరుపై ప్రజల ఆగ్రహం

మంచిర్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాకేంద్రంలోని రాముని చెరువు కబ్జాదారుల చేతుల్లో పడి ఖతమైతుంది. చెరువు శిఖం అంటూ లేకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాముని చెరువు సర్వే నంబర్ 406లో 47.32 ఎకరాల్లో విస్తరించి ఉండేది. కాలక్రమేణా అక్రమార్కుల పాలవుతోంది. దీని స్టోరేజీ 15 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు కాగా అది కూడా తగ్గిపోతోంది. పదేండ్ల కిందటి చెరువుకు, ఇప్పటి చెరువుకు వ్యత్యాసం చూస్తే ఏ మేరకు బఫర్ జోన్‌లో నిర్మాణాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చెరు వుల సమీప నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి.

ఎఫ్టీఎల్ 48 ఎకరాలు 

మంచిర్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ఈ రాముని చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాకు లెవల్) హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. వర్షాకాలంలో చెరువులోకి పూర్తి స్థాయిలో నీరు చేరినప్పుడు ఆ పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న ప్రాంతాలను హద్దులుగా గుర్తించి, రాముని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి సుమారు 48 ఎకరాలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా కేవలం వ్యవసాయం చేసుకోవడానికి తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అలాగే ఎఫ్‌టీఎల్‌కు మరో 30 మీటర్ల వరకు ఉన్న చెరువు బపర్ జోన్‌లో నిర్మాణాలు చేయరాదు. కానీ, రాముని చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్, శిఖం అని ఏదీ చూడకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తున్నారు. 

ఒక చోట అనుమతి.. మరో చోట నిర్మాణం

కొందరు అక్రమార్కులు ఒక సర్వే నంబర్‌తో భవన నిర్మాణాలకు అనుమతి తీసుకొని మరో చోట నిర్మాణా లు జరుపుతున్నారు. ఒక సర్వే నంబర్‌లో చెరువు శిఖం పట్టా భూమి ఉండవచ్చు. అయితే, శిఖం భూమి కాదని అనుమతి తీసుకొని చెరువులోనే నిర్మాణాలు చేస్తున్నారు. అది కూడా జీ+2, జీ+5 ఇలా నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో కోర్టుకు హైటెక్ సిటీని ఆనుకొని ఉన్న భూమి కేటాయిస్తే అది నిర్మాణాలకు పనికి రాదని చెప్పిన అధికారులు.. ఇప్పుడెలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు. అక్రమార్కులకు అధికారుల అండదండలున్నంత వరకు ఇలా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మా శాఖ నుంచి అనుమతి ఇవ్వట్లేదు 

చెరువు శిఖంలో నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించాం. మా శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మున్సిపాలిటీ అధి కారులు భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. ఈ విష యం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో భవన నిర్మా ణాలకు అనుమతించం. అలాంటివేమైనా జరిగితే మా దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నాం. రాముని చెరువు హద్దుల నుంచి 30 మీటర్ల వరకు ఎలాంటి అనుమతి ఉండదు. 

 -గౌతం, ఇరిగేషన్ ఏఈ, మంచిర్యాల