మణుగూరు (విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో అతి భయంకరమైన మహమ్మారిగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మిట్టగూడెం గిరిజన గురుకుల బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రవి హెచ్చరించారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కళాశాలలో విద్యార్థులు, అద్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనారోగ్య బారిన పడిన ప్రతి మానవుడు డాక్టర్ సలహాలతో వైద్య పరీక్షలు చేయించుకొని కోలుకోవడం సర్వసాధారణమని, క్యాన్సర్ బారిన పడిన మనిషి అద్భుతం జరిగితే తప్ప జీవించడం చాలా కష్టమని అన్నారు. అటువంటి భయంకరమైన మహమ్మారి దరిచేరకుండా ప్రతి ఒక్కరూ రోజువారి దైనందిన కార్యక్రమాలు సక్రమంగా పాటిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవని సూచించారు. మానవులుగా జన్మించిన తర్వాత జబ్బు పడడం సర్వసాధారణమని, మనిషి జీవించిన కొద్ది వ్యక్తిగత అలవాట్లలో మార్పులు చోటు చేసుకోవడం సహజమన్నారు.
పని ఒత్తిడి వల్ల మానసికంగా, శారీరకంగా బలహీనపడటం, ధూమపానం, మద్యపానం లాంటి దురాలవాట్లకు తోడు నాణ్యత లోపించిన కలుషిత ఆహారం, వాతావరణ కాలుష్యం వలన క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ప్రతి మనిషి పది కాలాల పాటు కుటుంబంతో కలిసి జీవించాలంటే ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంటే ఎటువంటి రోగాలు దగ్గరికి రావని, మంచి ఆరోగ్యంతో జీవించవచ్చన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా అధ్యాపకులు సూచించే సలహాలు పాటించి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.