calender_icon.png 28 October, 2024 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలయన్స్ నేతృత్వంలో ర్యాలీ

27-06-2024 01:52:51 AM

  • వరుసగా రెండో రోజూ మార్కెట్లో రికార్డుల జోరు

సెన్సెక్స్ మరో 621 పాయింట్లు జంప్

23,800పైకి నిఫ్టీ

న్యూఢిల్లీ, జూన్ 26: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) నేతృత్వంలో జరిగిన ర్యాలీతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ దూకుడు కొనసాగింది. క్రితం రోజు తొలిసారిగా బీఎస్‌ఈ  78,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ బుధవారం మరో 621 పాయింట్లు పెరిగి 78,674 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 706 పాయింట్లు పెరిగి 78,759 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారిగా 23,800 పాయింట్ల స్థాయిని దాటేసింది. ఇంట్రాడేలో 169 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ 23,890 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 147 పాయింట్లు లాభపడి కొత్త రికార్డుస్థాయి 23,869 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం వరుస ర్యాలీతో మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద రూ.2.53 లక్షల కోట్ల మేర పెరిగింది. తాజా అప్‌ట్రెండ్‌కు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సైతం దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు పెరిగాయి. 

ఫైనాన్షియల్, కన్జంప్షన్ స్టాక్స్‌లో పెట్టుబడులు

లార్జ్‌క్యాప్ షేర్లు ర్యాలీతో దేశీయ మార్కెట్ సరికొత్త గరిష్ఠానికి చేరిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. లార్జ్‌క్యాప్స్ విలువలు సరైనవిగా ఉన్నందున వాటిలో కొనుగోళ్లు జరిగాయని, వాటికి భిన్నంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ అధిక విలువలతో ఉన్నాయన్న భావనతో వాటిలో లాభాల స్వీకరణ జరిగిందని వివరించారు. బ్యాలెన్స్ షీట్స్ మెరుగుదలతో ఫైనాన్షియల్, కన్జంప్షన్ స్టాక్స్‌లో ప్రస్తుతం పెట్టుబడులు జరుగుతున్నాయని, జీడీపీ వృద్ధి జోరు, ద్రవ్యోల్బణం తగ్గుదల పట్ల అంచనాలతో ఈ షేర్లు పెరుగుతున్నాయని నాయర్ చెప్పారు. 

ఆర్‌ఐఎల్ కొత్త రికార్డు 

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతంపైగా పెరిగి రూ.3,038 వద్ద జీవితకాల రికార్డుస్థాయికి చేరింది. ఇదేబాటలో భారతి ఎయిర్‌టెల్ సైతం 3.3 శాతం ఎగిసి రూ.1,479 వద్ద కొత్త రికార్డుస్థాయిని తాకింది. అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్‌లు 1 శాతం మధ్య లాభపడ్డాయి.  మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ అధికంగా 2.30 శాతం పెరిగింది. ఎనర్జీ ఇండెక్స్ 1.45 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.78 శాతం, బ్యాంకెక్స్ 0.58 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.46 శాతం చొప్పున లాభపడ్డాయి.  కమోడిటీస్, కన్జూమర్ డిస్క్రీషనరీ, ఐటీ, ఆటోమొబైల్ సూచీలు నష్టపోయాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ సూచి 0.15 శాతం పెరిగింది.