calender_icon.png 23 October, 2024 | 7:54 PM

ఐటీ నేతృత్వంలో ర్యాలీ

13-07-2024 12:28:44 AM

  • స్టాక్ సూచీల సరికొత్త రికార్డులు 
  • సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్

ముంబై, జూలై 12: ఎన్నో వారాల అనంతరం ఐటీ షేర్లు శుక్రవారం మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ అంచనాల్ని మించిన ఫలితాల్ని వెల్లడించడంతో ఈ రంగంలోని షేర్లన్నీ కదం తొక్కాయి.దీంతో మార్కెట్ ప్రధాన స్టాక్ సూచీలు రెండూ సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్  619 పాయింట్లు పెరిగి తొలిసారిగా 80,500 ఎగువన 85,519 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 996 పాయింట్లు పెరిగి 80,893 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 276 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 24,592 పాయింట్ల వద్ద నూతన రికార్డును నెలకొల్పింది. చివరకు 186 పాయింట్ల లాభంతో  24,502 పాయింట్ల కొత్త గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది.

ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం కూడా ఇదే ప్రధమం. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. ఐటీ రంగం పట్ల తిరిగి ఇన్వెస్టర్లలో ఆశాభావం నెలకొనడం, యూఎస్‌లో ద్రవ్యోల్బణం తగ్గినట్టు వార్తలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ ఈ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు తాజా మార్కెట్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు తెలిపారు. టీసీఎస్ ఫలితాలు మార్కెట్‌ను ఆశ్చర్యపర్చడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ల నేతృత్వంలో ర్యాలీ జరిగిందని, అలాగే యూఎస్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఏడాది కనిష్ఠానికి తగ్గడంతో త్వరలోనే ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు.

టీసీఎస్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు 6 శాతంపైగా పెరిగి రూ.4,160 వద్ద నిలిచింది. జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికరలాభం 8.7 శాతం వృద్ధితో రూ.12,040 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఇతర ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలు 3 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ సూచిలో భాగమైన విప్రో 5 శాతం జంప్‌చేసింది. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రోలు 1 శాతం మధ్య లాభపడ్డాయి.

మరోవైపు మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి.   వివిధ రంగాల సూచీల్లో జోరుగా ఐటీ ఇండెక్స్ 4.32 శాతం పెరిగింది. టెక్నాలజీ ఇండెక్స్ 3.29 శాతం లాభపడింది. ఎనర్జీ ఇండెక్స్ 0.13 శాతం, బ్యాంకెక్స్ 0.10 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.06 శాతం చొప్పున లాభపడ్డాయి. రియల్టీ, పవర్, మెటల్, యుటిలిటీస్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్స్, కన్జూమర్ డిస్క్రీషనరీ సూచీలు తగ్గాయి.  బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం తగ్గగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.13 శాతం క్షీణించింది.

కొత్త రికార్డుస్థాయికి మార్కెట్ విలువ

తాజా ర్యాలీతో  ఇన్వెస్టర్ల సంపద రూ.1.17 లక్షల కోట్లు పెరిగింది. భారత స్టాక్ మార్కెట్ విలువ రూ.452.38 కోట్ల కొత్త రికార్డుస్థాయికి చేరింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,52,38,553 కోట్లకు చేరింది.