మాల్వీ మల్హోత్రాపైనా అనుమానం ఉంది
12 లక్షల విలువైన నగలు అపహరించారు
పోలీసులకు రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఫిర్యాదు
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 10: సినీ నటుడు రాజ్‌తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన ఫ్లాట్‌లో నుంచి రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా రూ. 12 లక్షల విలువ చేసే నగలు అపహరించారని లావణ్య మంగళవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాజ్‌తరుణ్ వద్ద బీరువా తాళపు చెవులు ఉన్నాయని, తాను ఇటీవల ముంబై వెళ్లి వాటిని తీసుకొచ్చినట్లు తెలిపింది.
సోమవారం రాత్రి బీరువాలో చూడగా నగలకు సంబంధించి ఖాళీ డబ్బా లు మాత్రమే కనిపించాయని వెల్లడించింది. రూ.12 లక్షల విలువ చేసే బంగారు నగలను రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా అపహరించినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అందులో పుస్తెల తాడు, నాలుగు బంగారు గాజులు, బ్రాస్‌లెట్, గొలుసు, చెవికమ్మలు ఉన్నాయని లావణ్య పేర్కొంది. మాల్వీ మల్హోత్రా తాను ఫ్లాట్‌లో లేనప్పుడు రెండుమూడు సార్లు వచ్చిందని, రాజ్‌తరుణ్ ప్రమేయం ఉందా.. లేదా మాల్వీ చోరీ చేసిందా అనే విషయం తెలియదని పేర్కొం ది.
లాకర్‌కు సంబంధించి పాస్‌వర్డ్స్ కేవలం తనకు, రాజ్‌తరుణ్‌కు మాత్రమే తెలుసని, గతంలో జైలుకు వెళ్లినప్పుడు అన్ని నగలను లాకర్‌లో భద్రపరిచినట్లు వివరించింది. ఫిర్యాదు అనంతరం తాను మా అసోసియేషన్‌కు వెళ్లి ఆందోళన నిర్వహిస్తానని లావణ్య స్పష్టం చేసింది. తాను ఇటీవల ముంబై వెళ్లినప్పుడు తాళపు చెవులు మాల్వీ మల్హోత్రా కప్ బోర్డులో ఉన్నాయని, రాజ్‌తరుణ్‌ను మాల్వీ తీసుకెళ్లి తనను ఒంటరి దాన్ని చేసిందని లావణ్య తీవ్రస్థాయిలో మండిపడింది. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తన నగలను అప్పగించాలని విజ్ఞప్తి చేసింది.