22-02-2025 12:00:00 AM
సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ రంగంలో తనదైన ముద్ర వేసిన సిసలైన క్రీడాకారుడు. ఆ లెజెండరీ ప్లేయర్ బయోపిక్‌పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ బయోపిక్‌పై సౌరవ్ గంగూలీనే స్వయంగా స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాజాగా బుర్ద్వాన్ వెళ్లిన గంగూలీ అక్క డ, తన బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నంతవరకు.. టైటిల్ రోల్‌లో రాజ్‌కుమార్‌రావ్ నటించనున్నారు. అయితే డేట్స్ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా విడుదలయ్యేందుకు మరో ఏడాదిపైనే సమయం పట్టొచ్చు’ అని చెప్పుకొచ్చారు.
సౌరవ్ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయమై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చివరికి రాజ్‌కుమార్‌రావు పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిరుడు ‘స్త్రీ2’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు రాజ్‌కుమార్‌రావు. అంతకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో ప్రతిభను కనబరిచారు. ఈ నేపథ్యంలోనే గంగూలీ బయోపిక్ కోసం రాజ్‌కుమార్‌రావును చేసుకున్నారని తెలుస్తోంది.