17-03-2025 01:15:36 AM
డిప్యూటీ సీఎం భట్టితో కార్పొరేషన్ల చైర్మన్ల భేటీ
పథకం విధివిధానాలపై చర్చ
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాస పథకం విధి విధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నిరుద్యోగుల కోసం తీసుకొస్తున్న ఈ పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, అర్హులను ఎంపిక చేయనుంది.
రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. సోమవారం నుంచి వచ్చే నెల 5 వరకు యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్లతో ప్రభుత్వ రాయితీ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ పాల్గొన్నారు.