calender_icon.png 12 March, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత కోసం రాజీవ్ యువ వికాసం

12-03-2025 01:14:20 AM

2025-26 బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటాయింపు

5లక్షల మంది యువతకు లబ్ధి

  1. ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు చేయూత
  2. పలు స్వయం ఉపాధి పథకాల అమలు 
  3. 15వ తేదీన విధివిధాలను ప్రకటిస్తాం
  4. అదే రోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
  5. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల పరిశీలన.. లబ్ధిదారుల ఎంపిక 
  6. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజున..  లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ 
  7. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాం తి): రాష్ర్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీయువకులకు చేయూతనందించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం ద్వారా 5లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున సాయమందిస్తామని చెప్పారు. ఇందుకోసం 2025--26 బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని వీర వనిత చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత స్వయం ఉపాధితో పాటు వారి అభ్యున్నతికి దోహదపడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నార న్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు పడ్డారని భట్టి  వివరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామన్నారు.

బ్యాంకులతో లింకు..

‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్ పరిధిలోకి కొన్ని స్వయం ఉపాధి పథకాలను తీసుకొస్తామని భట్టి చెప్పారు. ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ఈ నెల 15న పూర్తి విధివిధానాలతో ప్రకటిస్తామని, అదే రోజున నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ‘రాజీవ్ యువ వికాసం’ కోసం లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవ చ్చని వెల్లడించారు.

ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. తెలం గాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తున్నారని చెప్పారు.

సాయాన్ని బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇప్పిస్తుందన్నారు. అయితే ఇందులో ఎంతమేరకు సబ్సిడీ ఉంటుం దనేది విధివిధానాల్లో తెలియజేస్తామన్నారు. 

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ. 540 కోట్లు 

వీరవనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీ నిర్మాణానికి రూ. 540 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి అద్భుతమైన నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిందని ఈ సందర్భంగా తెలిపారు.

యూనివర్సిటీలో ఉన్న హెరిటేజ్ భవనాలను పునరుద్ధరిస్తామన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ర్ట ప్రభుత్వం రూ.15.5 కోట్లు, అదేవిధంగా నూతన భవన నిర్మాణాలకు తక్షణమే రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు హెరిటేజ్ భవనాలు, పునరుద్ధరణ ప్రణాళికలను అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు.

సమావేశం లో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీష్, యూనివర్సిటీ వీసీ సూర్య ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.