calender_icon.png 2 April, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువతకు ఆశా కిరణం రాజీవ్ యువ వికాసం..

31-03-2025 07:51:56 PM

ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు..

కాటారం (విజయక్రాంతి): నిరుద్యోగ యువత జీవితాలలో వెలుగులు నింపాలనే సదాశయంతో వినూత్న రీతిలో ఏర్పాటుచేసిన రాజీవ్ యువ వికాసం పథకం ఆశా కిరణం లాగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు 80 శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించేందుకు రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్ వాడ గ్రామంలోని మంత్రి శ్రీధర్ బాబు స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలోని యావత్ ముస్లిం సోదరులకు మంత్రి శ్రీధర్ బాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లలో మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో దేశంలోనే మొదటిసారిగా కులగణన సర్వే చేసి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించామన్నారు. గత పదేండ్లలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందని, ఎలాంటి నిధులు రాక సంక్షేమం కుంటుపడిందని శ్రీధర్ బాబు ఆరోపించారు. రాజీవ్ యువ శక్తి ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ఏప్రిల్ నెల ఐదో తేదీలోపు దరఖాస్తులు తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సబ్సిడీతో రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా కాటారం మండల కేంద్రమైన గారేపల్లిలో ముస్లిం సోదరులను మంత్రి శ్రీధర్ బాబు కలిసి ఆలింగనం చేసుకున్నారు. పవిత్రతకు, ఐక్యతకు ప్రతేకగా నిలిచిన రంజాన్ పర్వదినాన్ని సంయమనంతో, సంతోషంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఆయన వెంట కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే అమీర్, మాజీ కో ఆప్షన్ మెంబర్ అజీజ్, నాయకులు చోటే మియా, దాదా మియా, అక్బర్, అసరార్,  బోలేశా, ఇంతియాజ్, బాజీ, బాబర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, లింగమల్ల దుర్గయ్య, వొన్న వంశ వర్ధన్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరవెల్లి విలాస్ రావు, నియోజకవర్గం యూత్  అధ్యక్షులు చీమల సందీప్, మండల యూత్ అధ్యక్షులు చీటూరి మహేష్ గౌడ్,  పిల్లమారి రమేష్, తెప్పల దేవేందర్ రెడ్డి, చీర్ల తిరుపతి, మాజీ ఎంపీపీ రాజవీరు, గడ్డం కొమరయ్య , అజ్మీరా రఘురాం నాయక్, బొంపెల్లి రాజేందర్, అంగజాల అశోక్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.