01-04-2025 05:32:37 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
మంచిర్యాల (విజయక్రాంతి): నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఈ పథకం ఒక వరం లాంటిదన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, అర్హులైన వారు ఈ నెల 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రుణం రూ. 50 వేలలోపు 100 శాతం మాఫీ, రూ. 1 లక్షలోపు 90 శాతం రాయితీ, 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 80 శాతం రాయితీ, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని, రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందిస్తున్నామన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ప్రతిరోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.