08-03-2025 11:24:17 PM
రూ.20 లక్షలు అపహరణ, రూ.18 లక్షలు స్వాధీనం
విమానంలో రాజస్థాన్ వెళ్లి నిందితుల అరెస్టు
కేసు వివరాలు వెల్లడించిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్
రాజేంద్రనగర్: తాము పనిచేస్తున్న కంపెనీ నుంచి తొలగించారని కక్షగట్టిన ఇద్దరు రూ. 20 లక్షలు దారిదోపిడీ చేశారు. పోలీసులు విమానంలో రాజస్థాన్ వెళ్లి నిందితులను పట్టుకొచ్చారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్ శనివారం తన కార్యాలయంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈనెల 4న మధ్యాహ్నం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రకాలనీ మీదుగా స్థానికంగా ఓ ప్లాస్టిక్ కంపెనీకి చెందిన జితేందర్ అనే వ్యక్తి బైకుపై 20 లక్షలు తీసుకొని వెళ్తుండగా ఓ కారులో వచ్చిన దుండగులు అతడిని ఢీకొట్టి డబ్బులు మొత్తం తీసుకొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, ఏసీపీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. కారు కామారెడ్డి దాటుతున్నట్లు గుర్తించి నిర్మల్ పోలీసులను అలెర్ట్ చేశారు. టోల్‌గేట్ దగ్గర పోలీసులు ఉన్నారని దుండగులు కారును మహారాష్ట్రలోకి పోనిచ్చారు.
అక్కడ కారును వదిలేసి పారిపోయారు. రాజస్థాన్‌లోని ఫతేపూర్‌కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు సీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ తదితరులు విమానంలో అక్కడికి వెళ్లారు. అక్కడ నిందితులను కోర్టులో హాజరుపరిచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిందితులు వాడిన కారుతోపాటు వారి నుంచి రూ. 18 లక్షలు స్వాధీనం చేసుకొని తీసుకొచ్చారు. నిందితులు సచిన్, సీతారాం, హేమంత్‌ను అరెస్టు చేశారు. హేమంత్ వెనుక ఉండి కథ నడిపించారు. ఇతడితోపాటు సచిన్ గతంలో ప్లాస్టిక్ కంపెనీలో గతంలో పనిచేసేవారు. వీరిప్రవర్తన బాగలేకపోవడంతో యజమానులు పనిలోంచి తీసువేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కేసును చాకచక్యంగా సత్వరమే ఛేదించిన పోలీసు సిబ్బందిని డీసీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నరేందర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.