20-02-2025 01:24:12 AM
ప్రచారానికి దూరంగా వెలిచాల
కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డికి మద్దతుగా పత్రిక ప్రకటనలు విడుదల చేస్తూ హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. రాజేందర్ రావు ప్రచారానికి దూరంగా ఉండడం చర్చనీ యాంశమయింది. తనకు మద్దతుగా ప్రచారానికి రావాలని అభ్యర్థి వి నరేందర్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించినప్పటికీ ఆయన రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడున్నర లక్షల వరకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల అనంతరం చాలారోజులు ఇక్కడే మకాంవేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. ఆయన తొలుత ఎమ్మెల్సీ బరిలో ఉండాలని కూడా ఆలోచన చేసి తన అనుచరులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. నరేందర్ రెడ్డి రంగంలోకి వచ్చిన అనంతరం ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్ష పదవికి రాజేందర్ రావు పేరును కూడా ప్రతిపాదించారు.
అయితే పార్టీ అధ్యక్ష నియామకం ఆలస్యమవుతుండడంతో రాజేందర్ రావు హైదరాబాద్లోనే ఉండి తరచు సీఎంను, మంత్రులను కలుస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రాజేందర్ రావు రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అలక వహించారని కొందరు, ప్రచారానికి వస్తే తానే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని అందుకే దూరంగా ఉంటున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలు వారి వారి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్లోని కరీంనగర్ అసెంబ్లీకి వచ్చేసరికి సుడా చైర్మన్ గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనను పీసీసీ నిజామాబాద్ కు ఇంచార్జీగా నియమించడంతో ఇక్కడ ప్రచారం చేసేందుకు చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ నేతలను సమన్వయపరిచి ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడంతో సమన్వయం లోపించింది. వెలిచాల రాజేందర్ రావు ఇక్కడ ఉంటే ప్రచార జోరు పెరుగుతుందని ఆయన అనుచరులు భావిస్తు న్నారు. అయితే ఆయన మాత్రం కరీంనగర్ వస్తున్నా అంటున్నారు కానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇటువైపు రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన స్వంత నియోజకవర్గమైన హుస్నాబాద్‌కే పరిమితమవుతున్నారు. ఎన్నికలు మరో వారం రో జుల్లో ఉన్నందున రాజేందర్ రావును ప్రచారంలో దించాలని పార్టీ భావిస్తున్నట్లు నాయకులు చెప్తున్నారు. అయితే ఆయన వస్తారా, రారా అన్నదానిపై సస్పెన్షన్ నెలకొంది.