27-03-2025 10:23:47 PM
మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఆందోళనలో రాజాపూర్ గ్రామస్తులు..
మంథని (విజయక్రాంతి): సింగరేణి రామగుండం-3 ఏరియా ఓసీ-2 విస్తరణలో భాగంగా చేపడుతున్న పేలుళ్ళతో మా ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ రాజాపూర్ గ్రామస్తులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో ప్రతిరోజు చేపడుతున్న బ్లాస్టింగ్ తో ఓసీ-2 క్వారీ పక్కనే ఉన్న రాజాపూర్ గ్రామంలో ఇళ్లమధ్య మట్టి పెళ్లల్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కోపోద్రిక్తులైన గ్రామస్తులు మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో రాజాపూర్ గ్రామం ఎడారిగా మారుతుందన్నారు. గ్రామ సమీపాన ఓసిపిని తీసుకువచ్చి ప్రతిరోజు భారీ ఎత్తున బ్లాస్టింగ్ చేస్తుండడంతో ఇళ్లపైనే మట్టి పెడ్డలు పడుతున్నాయని, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.