29-04-2025 12:35:02 AM
వేములవాడ, ఏప్రిల్ 2౮: రాష్ర్టంలోనే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శృంగేరి పీఠాధిపతులు అనుమతులు ఇచ్చారని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్, సలహాదారు గోవిందాహరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి బృందం ఆదివారం శృంగేరికి తరలివెళ్లారు.
శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ స్వామితో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు ఈఓ వెల్లడించారు. ఆలయవిస్తరణ నమూనాలు, పూజా విధానాలు, భక్తుల దర్శనాలపై మాట్లాడినట్టు తెలిపారు. విస్తరణ పనులు సాగే క్రమంలో శ్రీరాజరాజేశ్వరస్వామికి నిత్యం నిర్వ హించే పూజా కార్యక్రమాలు యథావిధిగా ఏకాంతంగా దేవాలయ అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవల ఏర్పాట్లు భీమేశ్వర ఆలయంలో చేయాలని తెలిపినట్లు వివరించారు. త్వరలోనే ఆలయ విస్తరణపై టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.