27-02-2025 10:45:44 PM
బంగ్లాదేశీయులు నకిలీ పేర్లతో హైదరాబాద్‌లోకి చొరబడ్డారు
ఎక్స్‌లో రాజాసింగ్ పోస్ట్ వైరల్
హైదరాబాద్,(విజయక్రాంతి): ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ(Hyderabad Old City) రోహింగ్యాలకు బలమైన కోటగా మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) ఆరోపించారు. బంగ్లాదేశీయులు నకిలీ హిందూ పేర్లతో చొరబడ్డారని, హైదరాబాద్‌లో అక్రమాలకు పాల్పడుతూ మరోసారి పట్టుబడ్డారని ఆయన తన ఎక్స్ ఖాతాలో గురువారం పేర్కొన్నారు. దాంతో పాటు ఇటీవల వ్యభిచార గృహాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ బంగ్లాదేశీయుల ఫొటో, వార్త క్లిప్పింగ్‌ను జోడించారు. మానవ అక్రమ రవాణా, సెక్స్ రాకెట్ బయటపడటంతో ఇది మరోసారి రుజువైందని విమర్శించారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా హైదరాబాద్‌కు వారు వస్తున్నారని, ఇక్కడి నుంచి బెంగుళూరు, చెన్నై, కలకత్తా, తదితర ప్రాంతాలకు విస్తరిస్తున్నారని ఆరోపించారు. చొరబాటుదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.