22-03-2025 02:21:23 PM
హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా? జాతీయ నాయకత్వమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారని రాజాసింగ్ ఆరోపించారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందన్నారు. గతంతో చేసిన అధ్యక్షుడు గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త బీజేపీ(Bharatiya Janata Party) అధ్యక్షుడు అదే గ్రూప్ ఇజం చేస్తే పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం మంచి నాయకుల చేతులు కట్టి పక్కన పడేశారని, సీనియర్ నేతలకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ సూచించారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు సీఎంతో రహస్య భేటీలు నిర్వహించవద్దు.. సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులో మాట బయటపెడుతున్నానని రాజాసింగ్ పేర్కొన్నారు. పార్టీ నేతలకు చెప్పాలే గానీ మీడియాకు చెప్పవద్దని కొందరు చెబుతున్నారు.. పార్టీ పెద్దల దృష్టికి తెస్తే వినకపోతేనే ప్రజల ముందు పెడుతున్నానని ఆయన వెల్లడించారు. బీజేపీ సీనియర్ నాయకులను గుర్తించలేదని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదన్నారు.