02-05-2024 12:05:00 AM
గురుగ్రామ్, మే 1: ప్రముఖ నటుడు, రాజకీయనేత రాజ్ బబ్బార్‌ను గురుగ్రామ్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై తొలి నుంచీ కాస్త సందిగ్ధత ఉంది. గత వారంలోనే హరియాణాకు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అందులో గురుగ్రామ్ పేరు లేదు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అయితే ఆప్‌కు ఈ సీటు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు కాంగ్రెస్ నేతనే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. 2008లో ఏర్పడిన ఈ స్థానం నుంచి ఇప్పటివరకు యాదవ వర్గానికి చెందిన వారినే కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటిస్తూ వచ్చేది. కానీ తొలిసారిగా ఆ వర్గానికి చెందని వారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. గురుగ్రామ్‌లో కాంగ్రెస్‌కు యాదవ వర్గంతో పాటు వేరే వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు.