- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- రెండు ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నీచర్, టాయిలెట్స్ క్లీనింగ్ మెషిన్ల పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచడానికే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమివ్వడంతో పాటు మాతృభాషను రక్షించుకునేలా సమూలమైన మార్పులు తెచ్చామన్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి (ఏబీవీ) ఫౌండేషన్ బీడీఎల్ సహకారంతో సికింద్రాబాద్ సీతాఫల్‌మండీ, విద్యానగర్ జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక కార్పొరేటర్, అధికారులతో కలిసి సోమవారం ఆయన ఫర్నీచర్, టాయిలెట్స్ క్లీనింగ్ మెషిన్లను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..
నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో భాగంగా హైస్కూల్ స్థాయి నుంచే వివిధ ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రైవేటు స్కూళ్లలో ఉండే ఫీజుల ఒత్తిడి కారణంగా మానసిక ఇబ్బందులకు గురికాకుండా పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు.
దేశానికి పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే స్వచ్ఛ భారత్, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్టు గుర్తుచేశారు. ఈ నెల 8న జరగనున్న దిశ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తానని వెల్లడించారు.
అంబర్‌పేట్‌లో పర్యటన
అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు బస్తీలలో అధికారులతో కలిసి పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు డ్రైనేజీ ఓవర్ ఫ్లో, తాగునీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.