calender_icon.png 7 October, 2024 | 11:57 PM

వానకాలం.. వ్యాధులతో భద్రం!

02-09-2024 12:00:00 AM

వానకాలం వానలతో పాటు అనేక రోగాలను కూడా తీసుకువస్తుంది. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్లు, జ్వరం, విరేచనాలు, చర్మ సమస్యలతో పాటు రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే మిగిలిన సీజన్ల కంటే వానకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే వ్యాధులు, జ్వరాలు.. వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

ఈ సీజన్‌లో వర్షాలకు కాలువలు, కుంటల్లో నీరు చేరుతుంది. ఈ నీరు తాగునీటి సరఫరా పైపుల్లోకి చేరితే మంచినీరు కలుషితమై నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. 

కలరా: ఇది తాగునీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అతిసారాకు కారణమవుతుంది. దీని నివారణకు మంచి నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం ముఖ్యం. అలాగే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడిగా తినాలి. 

హెపటైటిస్ ‘ఏ’: ఇది కలుషితమైన నీటి నుంచి సంక్రమించవచ్చు. కాలేయ ఆరోగ్యంపై దాడి చేస్తుంది. కామెర్లు, జ్వరం, వికారం మొదలైన వాటికి దారితీస్తుంది. 

అథ్లెట్స్ ఫుట్: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాలి వేళ్ల మధ్య దురద, ఎరుపు, పొలుసులను కలిగిస్తుంది. వర్షపునీటిలో ఎక్కువగా పనిచేసే వ్యక్తుల పాదాలు చాలా సమయం తడిగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.

జ్వరాలతో జాగ్రత్త

డెంగీ: డెంగీ జ్వరం సాధారణంగా పగటి పూట, సాయంత్రం కుట్టే ఆడ ఎడిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. డెంగీ బారిన పడినప్పుడు అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, లోబీపీ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో శ్వాస ఇబ్బందులతో పాటు ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోతుంది. డెంగీ తీవ్రమైతే ప్రాణాంతకమై మరణించే ప్రమాదం ఉంది. అందుకే పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. 

మలేరియా: ఇది ఆడ అనాఫిలిస్ దోమకాటు వల్ల వస్తుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా బారిన పడితే అధిక జ్వరం, గొంతు మంట, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కీళ్లనొప్పి, కండరాల నొప్పి, గ్రంథుల వాపు, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమైతే మూత్రపిండాల వైఫల్యం, కామెర్లు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే మలేరియా ప్రాణాంతకం కావొచ్చు. 

చికెన్ గున్యా: ఏడిస్ ఈజిఫ్టీ అనే దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. ఈ దోమలు ఎక్కువగా మురికి నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి కుట్టిన 3 రోజుల్లో వ్యక్తికి తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగలేకపోతే.. సూప్స్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలి. వేడి ఆహారపదార్థాలు మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ సూచనలను తప్పక పాటించాలి. 

టైఫాయిడ్: టైఫాయిడ్ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ఒక సూక్ష్మ జీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి రెండు మూడు వారాల సమయం పట్టవచ్చు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, రక్తంలో తెల్ల రక్తకణాలు తగ్గడం, విరేచనాలు, కడుపు నొప్పి, నీరసం, అలసట, గుండె వేగంలో మార్పులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. 

ఇన్‌ఫ్లుయేంజా: ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. జ్వరం త్వరగా తగ్గినప్పటికీ దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. ఇది తుమ్మడం, దగ్గడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 

ఈ జాగ్రత్తలు పాటించాలి

  1. దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ తెరలు వాడాలి. 
  2. వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. 
  3. ఏదైనా తినే ముందు మల మూత్ర విసర్జనల తర్వాత చేతులను తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి. 
  4. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. 
  5. విరేచనాలు, వాంతులు ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు వెళ్లాలి. 
  6. జలుబు, దగ్గుతో బాధపడుతుంటే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.