calender_icon.png 20 September, 2024 | 6:59 PM

వానకాలం.. కాళ్లు, కీళ్లు పైలం!

29-07-2024 12:00:00 AM

సహజంగా 30-40 ఏళ్ళు దాటాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కూల్ డ్రింక్స్, జంక్‌ఫుడ్ వల్ల పిల్లలపై.. మద్యం, ధూమపానం వల్ల యువతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆల్కహాల్, ధూమపానం అనేవి కాలేయాన్ని, ఊపిరితిత్తులనే కాకుండా ఎముకలనూ పాడు చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ లేదా ప్రమాదవశాత్తు ఫ్రాక్చర్లు అయితే అతుక్కోవడం కష్టం కావొచ్చు. పొగతాగడం వల్ల ‘నికోటిన్ బోన్ సీజ్’, అధిక మద్యపానం వల్ల ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్’ తో తుంటి జాయింట్లు దెబ్బతింటాయి. చర్మవ్యాధులు లేదా ఆస్తమా వంటి వాటికి స్టెరాయిడ్స్ తీసుకుంటే ఎముకలు బోలుగా మారి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. 

చిన్నవయసులో మోకాళ్ల నొప్పులొస్తే?

చిన్న వయసులో మోకాలి జాయింట్ గాయాలైనప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లిగ్మెంట్ ఇంజూరీ’ వల్ల మోకాళ్లపై ఒత్తిడి సరిసమానంగా పడక ఒకవైపు అరిగిపోయి ‘ఆస్టియో ఆర్థరైటిస్’ వస్తుంది. చిన్నప్పుడే లిగ్మెంట్‌ల గాయాలను అశ్రద్ద చేయకుండా ఆర్థోస్కోపి ఆపరేషన్ చేయించుకోవాలి. చిన్నపిల్లల్లో ‘ప్లాట్ ఫుట్’కు గతంలో అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్లం కాదు. దీనివల్ల కాళ్లపై సరిసమానంగా బరువు పడక భవిష్యత్‌లో మోకాళ్లు అరిగిపోతాయి. దీనిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వైద్యం చేయించాలి. చిన్నప్పుడే దానికి తగ్గట్టుగా కాలి చెప్పులు మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు.

మోకాళ్ల అరిగిపోతే నడవొచ్చా? 

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్లు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగం అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. 

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే?

మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి/ నొప్పులు తగ్గడానికి గార్డులు, క్రేప్ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్ సాక్స్, చిన్న బ్రేసెస్ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. 

మోకాళ్ల నొప్పులు ఉన్నవారు చేయకూడని పనులేంటి? 

మోకాళ్ళ నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే.. ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం చేయవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవాలి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం, లేవడం చేయవద్దు. బరువైన వస్తువులు ఎత్తకపోవడం ఉత్తమం. 

మోకాలి నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి?

మోకాలి నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. డాక్టర్లు మోకాళ్లను ఎక్స్ తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతో పాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి.

కీళ్లనొప్పులు పెరగడానికి కారణం?

శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే బరువు పెరిగి ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నుపూస నొప్పికి దారితీస్తాయి. అధి క సమయం మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వల్ల, సరిగా కూర్చోకుండా కొన్ని గంటల పాటు కంప్యూటర్ల వద్ద పని చేయడం వల్ల మెడ, భుజం, నడుం, చేతుల నొప్పులు వస్తాయి. తరచుగా వచ్చే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులతో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజూ రీస్, కండరాల్లో వచ్చే ‘టీనో సైనోవిటీస్’ నొప్పి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, నడుం నొప్పి, సయాటికా వంటివి ప్రధానమైనవి.  

మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్ అవసరమా?

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు పది అడుగులు వెయ్యలేక నాలుగు మెట్లు ఎక్కలేక రోజువారి పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఆపరేషన్ ఒక్కటే మార్గమా అంటే కచ్చితంగా కాదు అంటాను. ఆధునిక పద్ధతులతో ఆపరేషన్‌తో పని లేకుండా మోకాలిని పునరుర్జీవం చేసే నొప్పిని దీర్ఘకాలం దూరం చేసే పలు మార్గాలు ఉన్నాయి. వయసు పైబడిన వారికి మోకీలు శాస్త్ర చికిత్స శ్రేయస్కరం కాదు. రీజనరేటివ్ థెరపీ మోకాళ్లలోని కార్టిలేజ్ని పునరుత్పత్తి చేసే ప్రక్రియలో సొంత రక్తం నుంచి వేరు చేసిన పదార్థాలను ఉపయోగిస్తారు.

ఈ పదార్థాలలో ప్రధానమైనవి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సెంట్రేట్, స్టెమ్ సెల్స్, అలాగే ఎముకలలోని మధ్య నుంచి కానీ కొవ్వు కణజాలం నుంచి కానీ మూల కణాలను వేరు చేసి మోకాళ్లలో ప్రవేశపెట్టినప్పుడు కార్టిలేజ్ పునరుత్పత్తి సాధ్యమవుతుంది. కొందరిలో జాయింట్‌ని సైనోవియల్ ప్లూయిడ్ అనే జిగురు పదార్థం క్షీణిస్తుంది దీనిని ఇంజక్షన్ ద్వారా మర ఎక్కించవచ్చు. చికిత్స ఆరంభం నుంచే నొప్పి తగ్గుముఖం పడుతుంది. కాబట్టి రోజువారి కార్యక్రమాలు చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ అవసరం లేదు. తీవ్రమైన మోకాళ్ల నొప్పులకు కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్, ప్రోలో థెరపీ వంటి అధునాతన భద్రత పద్ధతుల ద్వారా నియంత్రించవచ్చు.  

నడుం నొప్పి తగ్గాలంటే..

నడుం నొప్పి అనగానే ఆపరేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లేవకుండా మంచానికే పరిమితం కావాలనే అపోహ చాలామందిలో ఉంటోంది. వెన్నుపూస జారిపోయి ‘స్పాండిలో లిస్త్రిసిస్’, కాళ్లలో తిమ్మిర్లు వచ్చి నడవలేకపోవడం వంటి వారికే వాస్తవంగా ఆపరేషన్ అవసరం అవుతుంది. ఒట్టి నడుం నొప్పి ఉన్న వారికి ఆపరేషన్ అవసరం లేదు. ఈ నొప్పి క్రమం తప్పకుండా విపరీతంగా వస్తుంటే మిగతా ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చాయేమోనన్నది సరి చూసుకోవాలి. కొన్నిసార్లు శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ సోకితే అది ఎముకల్లోకి రావొచ్చు. దానివల్ల నడుం నొప్పి రావొచ్చు. నడుం నొప్పి అనేది వ్యాధి కాదు. శరీరంలో చోటుచేసుకునే అనేక అనర్థాలకు అదొక లక్షణంగానే పరిగణించాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  1. వానకాలంలో ఎముకలు విరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్షణకాలం అజాగ్రత్తగా వ్యవహరించినా.. కొన్ని నెలల పాటు ఇంటికి, మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది. వానకాలంలో యాక్సిడెంట్లు, ఇతర రూపాల్లో వచ్చే అనుకోని సంఘటనలతో ఆర్థోపెడిక్ సమస్యలు పొంచి ఉంటాయి. 
  2. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఇళ్లలోనే అనుకోకుండా జారిపడితే తుంటి ఎముక జారడం, వెన్నుపూస, చేతులు, కాళ్ల ఎముకలు విరగడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలతో ఇంటికి లేదా మంచానికే పరిమితం కావడం వల్ల కీళ్ల నొప్పులు/ కీళ్ల వాతం సమస్యలు వస్తాయి.
  3. ఏ కాలంతోనూ సంబంధం లేకుండా బాత్రూంలు/ టాయ్‌లెట్లలో జారిపడటం సహజం. ముఖ్యంగా వయసు పైబడిన వారు ఈ ప్రమాదాలకు అధికంగా గురవుతుంటారు. బాత్రూంలలో పడినవారికి ఎక్కువగా కీళ్లు బెణకడం, ఎముకలు విగడం జరుగుతుంటుంది.
  4. ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల బ్రేకులు, టైర్లను సరిచూసుకోవాలి. రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లవద్దు. రోడ్ల పరిస్థితిని బట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలి. రోడ్లు సరిగా లేకపోవడం, ఎక్కడైనా గోతులు, గుంతలు పడి ఉండడం, వాటిలో వర్షం నీరు చేరిపైకి కనబడకుండా పోవడం వంటి వాటి వల్ల వెహికల్స్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. వాహనాల వైపర్లు సరిచూసుకోవాలి. వాగులు, వంకలు దాటేప్పుడు తొందరపాటు పనికిరాదు. నీటి ప్రవామ వేగాన్ని తక్కువ అంచనా వేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.
  5. వానకాలంలో తరచూ బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అవసరమైన సరుకులు, వస్తువులు తగినంతగా ఒకేసారి నిల్వచేసి పెట్టుకుంటే తరచూ బయటికెళ్లే పని తప్పుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
  6. ఇళ్ల లోపల నేల, ఫ్లోరింగ్‌పై తడిలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. టాయ్‌లెట్‌కు, స్నానానికి వెళ్లినప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

* 30---40 ఏళ్లు దాటక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. పిల్లలు మొదలు యువత, మధ్య వయస్సు వారిపై వివిధ రూపాల్లో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే వయసుతో పాటు వచ్చే ఎముకల సమస్యలతో పాటు వానకాలంలో ఎముకలు, కీళ్లకు సంబంధించిన (ఆర్థోపెడిక్) సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. వానకాలం ప్రమాదవశాత్తు పడడమో, ఏదైనా యాక్సిడెంట్‌కు గురికావడం ద్వారా ఎముకలు విరగడం వంటివి జరగకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ట్రీట్‌మెంట్‌కు సంబంధించి అత్యాధునిక వైద్య విధానాల గురించి ప్రముఖ “డాక్టర్ విజయ్ భాస్కర్ బండికట్ల” చెప్తున్న సూచనలెంటో తెలుసుకుందాం..

సర్జరీ లేకుండా..

నడుమునొప్పి లేక తుంటి నొప్పి ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయక డాక్టర్ సమక్షంలో ఎంఆర్‌ఐ స్కాన్ వంటి పరీక్షలు అవసరం అవుతాయి. ఈ తీవ్రమైన నొప్పుల కారణంగా ఎక్కువగా వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కుల నుంచి కానీ వాటి వెనుక ఉన్న వెన్నుముక లేక నరాలపై ఒత్తిడికి కారణం కావొచ్చు. దీన్ని డిజిటల్ స్పైనల్ ఎనాలసిస్ వంటి అధునాతన పద్ధతుల ద్వారా నొప్పి ఒక ప్రదేశాన్ని గుర్తించవచ్చు. బయాక్యులో ప్లాస్టి న్యూక్లియోలైసిస్ వంటి పద్ధతుల ద్వారా డిస్క్ అరుగుదలను తద్వారా స్పైన్ ఆపరేషన్లను నిరోధించవచ్చు. నడుములోని చిన్న జాయింట్స్ అయినా ఫైసెట్స్ నుంచి వచ్చే నొప్పిని రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ ద్వారా దీర్ఘకాలం అరికట్టవచ్చు. వెన్ను ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పులకు ఎఫెక్ట్ జీరోస్కోపీ స్పైనల్ కార్డ్ స్టిములేషన్ లేక స్పైనల్ పంప్స్ ఆధారంగా నొప్పికి ఉపశమనం పొందవచ్చు. 

 డాక్టర్ విజయ్ భాస్కర్ బండికట్ల

ఎంబీబీఎస్, ఎఫ్‌ఎఫ్‌పీఎమ్‌ఆర్‌సీఏ

న్యూరోమోడ్యులేషన్స్ అండ్ 

అడ్వాన్స్‌డ్ పెయిన్ 

ఇండో అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్