05-04-2025 06:53:02 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని, ఏప్రిల్ 7, 8వ తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం, ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయని, అలాగే మూడు రోజుల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 7న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 8న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సిద్ధిపేట, జనగామ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూర్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో నారాయణపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ తెలిపింది.