calender_icon.png 24 October, 2024 | 7:44 AM

రాతిగడ్డ.. కన్నీళ్ల అడ్డా అయింది...

02-09-2024 11:06:12 AM

చెరువుల కబ్జాతో జనం బేజారు

ఖమ్మం, (విజయక్రాంతి): ముందస్తు ప్రణాళిక లేకుండా, అభివృద్ధి అంటూ చేసిన చేష్టలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణ పేరుతో కోట్లు కుమ్మరించి, చెరువులను కబ్జా చేసి, కుదించి, వాటిపై ట్యాంక్ బండ్ లు రోడ్లు కట్టించి మూసేశారు. వర్షం వస్తే ఖమ్మం నీటిని తోడి ఏట్లో పోసే అతి పెద్ద డ్రెయినేజీ గోళ్ళపాడు ఛానల్ మొత్తం పూడ్చేసి, పార్కులు కట్టారు. రోడ్లు మొత్తం కబ్జా అయ్యాయి. రఘునాధపాలెం నుంచి లకారమ్ చెరువు వరకు వున్న లింక్ చెరువులు పొంగి పొర్లితే ఆ నీరు ఎటు పోవాలి. అవన్నీ అపార్ట్మెంట్లు, ఇళ్లు నిండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్ టీఎల్ లో అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం తో ఇప్పుడు మోసపోయిన వాళ్ళు మునుగుతున్నారు.

రామన్నపేట, దానవాయి గూడెం నుంచి ఖమ్మం పాత బస్ డిపో వరకు ఖమ్మం జలమయం అయ్యింది. నీళ్లకు ఎటుపోవాలో దారి తెలియక రోడ్డు పైనే తిష్ట వేసి, భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖమ్మం త్రీ టౌన్ ఏరియా, మోతినగర్, బొక్కలగడ్డ కు పరిమితమయ్యే వరద ముంపు, అధికారుల, కొందరు ప్రజాప్రతినిధుల స్వార్దం వల్ల ఖమ్మాన్ని అతలా కుతలం చేస్తుంది. ఖానాపురం హవేలీ చెరువు లోకి, రఘునాథ పాలెం నుంచి అలుగు పారి వస్తుంది. ఖానాపురం చెరువు మొత్తం కబ్జా అయ్యింది, ఇంకా అవుతుంది. ఆ చెరువు అలుగు పడి, ఎన్నెస్పి యూటి కింద ఎగతట్టి, న్యూ విజన్ స్కూల్, ప్రగతి నగర్, చైతన్య నగర్ మీదుగా కబ్జా అయిన ఇరుకు నాలాల్లో దూరలేక, వైరా రోడ్డు పై వాగు రూపం దాల్చాయి.

డివైడర్ నీ పగలగిడితే గానీ నీరు పోయే పరిస్థితి లేదు. రెండు చోట్ల డివైడర్ లు పగులగొట్టారు. ఈ నీరంతా, నాగార్జున ఫంక్షన్ హాల్ పక్క నుంచి లకారము చెరువులో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. జేసిబిలతో గండ్లు కొట్టి నీళ్ళను నిమజ్జనం చేస్తున్నారు. పోలీసులు, ఈతగాళ్లు, ఆర్మీ అవసరం అయ్యే స్టేజికి ఖమ్మాన్నీ తెచ్చారు. రాష్ట్రం మొత్తం మునిగినా ఖమ్మం కమాన్ లా నిలిచే రాతి గడ్డ. ఇప్పుడు నీళ్లకు, కన్నీళ్లకు అడ్డా.. అమాత్యా ఇకనైనా మేలుకొని కబ్జా అయిన నాలాలకు పునరావాసం కల్పించాలి. పర్యాటక నాటకం పేరుతో, కట్టిన ఫంక్షన్ హాళ్లు, హోటళ్ళు, క్లబ్ లు, తొలగించి, చెరువులను చెర నుంచి విముక్తి కల్పించాలి. సమగ్ర సర్వే చేసి శాశ్వత హద్దు రాళ్ళు పెట్టాలి. ఒక్కరాత్రి వర్షానికి డివైడర్లు పగలకొట్టుకొనే రోజు లేని రోజే.. నిజమైన సుందరీకరణ అని ప్రజలు అంటున్నారు.