ఖమ్మం వీధులన్నీ జలమయం
ఖమ్మం ఐటీ హబ్ లో లీకులు - వరద నీరుతో ఇబ్బంది
సత్తుపల్లి బొగ్గు గనుల్లో ఉత్పత్తి కి అంతరాయం
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 67.2 మీ.మీ వర్షపాతం నమోదు
ఖమ్మం,(విజయక్రాంతి): అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి జోరుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి .దీంతో రోడ్లు, వీధులన్నీజలమయ మయ్యాయి.రోడ్ల మీదకి వరదనీరు చేరడంతో ప్రజలు ,పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థ పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఓపెన్ కాస్ట్ సింగరేణి బొగ్గు గనుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవియర్ ఓపెన్ కాస్ట్ లో 30 వేల టన్నులు ,కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 5 వేల టన్నుల కు పైగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. జిల్లాలోని పాలేరు , వైరా,లంకాసాగర్ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు .ఇదిలా ఉంటే దాదాపు రూ 28 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఐటీ హబ్ లీక్ అయి కురుస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రఘునాధపాలెం మండలం లో 66.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా, తిరుమలాయపాలెం 60 మిల్లీ మీటర్లు, నేలకొండ పల్లి 62 మీ.మీ, సత్తుపల్లిలో అత్యధికంగా 67.2 మీ.మీ వర్షపాతం నమోదుకావడంతో సత్తుపల్లి లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది.