calender_icon.png 19 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి వాన కష్టాలు

29-06-2024 12:00:00 AM

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలపై ప్రకృతి పగబట్టిందా? అనిపిస్తోంది. నిన్నటిదాకా భానుడి ప్రకోపంతో అష్టకష్టాలు పడ్డ ఢిల్లీ వాసులు ఇప్పుడు వరుణుడి ఉగ్రరూపాన్ని చవి చూస్తున్నారు. ఒక్కరోజు కురిసిన కుండపోత వానకే నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసి నా వర్షపు నీరు రహదారులను ముంచేయడంతో వాహనాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో 24 గంటల వ్యవధిలో 235 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురిసింది. 1986 తర్వాత జూన్ నెలలో ఒక్కరోజులో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఒక్క చినుకు లేని నగరంలో రుతు పవనాల రాకతోనే భారీవర్షం కురవడం ఓ విధంగా నగర వాసులు ఎదుర్కొంటున్న వేసవి కష్టాలకు పరిష్కారం చూపినట్లయింది.

అయితే, ఈ వర్షం కొత్త సమస్యలను తెచ్చింది. నగరమంతా వరదనీటిలో చిక్కుకు పోయింది. ఎక్కడ చూసినా భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. కార్లుసహా వందలాది వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. ఓ అండర్ బ్రిడ్జి వద్ద వరదనీటిలో బస్సు చిక్కుకు పోవడంతో తాళ్ల సాయంతో ప్రయాణికులను రక్షించాల్సి వచ్చింది. ఎంపీల నివాసాలను సైతం వరద నీరు ముంచెత్తింది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ఒకరు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. మరో వారం పాటు నగరంలో వర్షా లు కురిసే అవకాశం ఉండడంతో ఇంకెన్ని కష్టాలు ఎదురవుతాయోనని ప్రజలు భయపడుతున్నారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే పరిస్థితి ఏమిటని వారు తల్లడిల్లి పోతున్నారు. గతంలో యమునా నదికి వరద వచ్చినప్పుడు పడిన కష్టాలు గుర్తుకు చేసుకుంటున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాలువల్లో చెత్తా చెదారాన్ని తొలగించక పోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశ రాజధానిలో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థే లేదని, కేజ్రీవాల్ సర్కార్ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టలేదంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఓ కౌన్సిలర్ అయితే వరదతో నిండిన రోడ్డుపై చిన్న పడవ నడిపి నిరసన తెలిపారు. 

ఢిల్లీలో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ప్రతి అంశాన్ని అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. మొన్నటి దాకా నగర ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి సమస్య విషయంలోనూ ఇదే జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీలో వేసవిలో ఎండలు మండిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటితే రాత్రిపూట తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడి పోయారు. వేడిగాలులకు వందలాదిమంది నిర్వాసితులు పిట్టల్లా రాలిపోవడం దయనీయం. ఇక, తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగరానికి విడుదల చేయాల్సిన వాటా నీటిని హర్యానా ప్రభుత్వం  విడుదల చేయకపోవడంతో సామాన్యుడి నుంచి భాగ్యవంతుల దాకా గుక్కెడు తాగునీటికోసం నానా అవస్థలు పడ్డారు.

కార్పొరేషన్ నీటి ట్యాంకర్ల కోసం జనాలు తెల్లవారక ముందు నుంచే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యం. వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, చెట్లను నరికి వేయడం అన్నీ కలిపి ఢిల్లీ నగరాన్ని అగ్నిగుండంగా మార్చేశాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో రాష్ట్రపాలన అస్తవ్యస్తంగా మారింది. మంత్రి ఆమరణ దీక్ష చేసినా పట్టించుకున్న వాళ్లే లేరు. కేంద్రపాలిత ప్రాంతమైనా సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపలేదు. పరిస్థితి రాజకీయ పార్టీలకు ఓట్లు తెచ్చిపెట్టేందుకు దోహదపడవచ్చునేమో కానీ కోటిమందికి పైగా ఉన్న మహానగర ప్రజల సమస్యను ఏ విధంగానూ తీర్చదు. దేశ రాజధాని పరిస్థితే ఇలా ఉండడం ఏ ప్రభుత్వ ప్రతిష్ఠకూ శోభించదు.