హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో నిన్న కురిసిన జడివాన నగరవాసుల్ని హడలెత్తించింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం.. అల్లకల్లోలం చేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, మలక్ పేట, బేగంబజార్, జూబ్లీహిల్స్, అమీర్ పేట, ఎర్రగడ్డ, నాంపల్లి, అంబర్ పేట, గోల్కొండ, గౌలిగూడ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. యూసుఫ్ గూడలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రూడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.