calender_icon.png 27 October, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వదలని వాన

22-07-2024 12:50:28 AM

  1. నిండుకుండలా హుస్సేన్‌సాగర్ 
  2. గోల్కొండ వద్ద అత్యధికంగా 2.6 సెం.మీ వర్షపాతం  
  3. నగరానికి ఆరెంజ్ అలర్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): నగరంలో ఆదివారం కూడా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజామున మొదలైన వర్షం ఆదివారం కూడా ఏకధాటిగా కురిసింది. ప్రజలు గొడుగు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యలో కొద్ది నిమి షాలు తెరిపిచ్చినా మళ్లీ కొనసాగింది. ప్రజ లు వర్షంలోనే తమ పనులు చక్కబెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి హుస్సేన్ సాగర్‌కు చేరుతోంది.

హుస్సేన్ సాగర్ 513.41 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) కాగా, గరిష్ఠంగా వాటర్ లెవల్ 514.75 మీటర్ల నీటి మట్టం కలిగి ఉంది. అయితే, ఆదివారం హుస్సేన్‌సాగర్ 513.23 మీటర్ల నీటి మట్టానికి చేరుకుంది. దీంతో జలకళను సంతరించుకుంది. హుస్సేన్ సాగ ర్ నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 1517 క్యూసెక్కుల నీరు చేరుతుం డగా, 998 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన కవాడిగూడ, డీఎస్‌నగర్, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్‌బండ్, అంబేద్కర్ నగర్, బాపూనగర్, చిక్కడపల్లి, ముషీరాబా ద్, అంబర్‌పేట ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

మరో రెండ్రోజులు ఆరెంజ్ అలర్ట్.. 

జీహెచ్‌ఎంసీలో ఆదివారం సాధారణ వర్షపాతం 2 సెంటిమీటర్లు ఉండగా, అత్యధికంగా గోల్కొండలో 2.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రాగల రెండ్రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరానికి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. 

మడుగు కాదు.. ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు

పటాన్‌చెరు: ఎడతెరిపి లేని వర్షానికి బొల్లారం ఖాజీపల్లి ఓఆర్‌ఆర్ సమీపంలోని సర్వీసు రోడ్డు బ్రిడ్జి వద్ద భారీ గా నీరు నిలిచింది. రోడ్డుకు ఇరువైపులా నీరు నిలవడంతో పెద్ద మడుగును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు.