ప్రేమతో సున్నితంగానో
కోపంతో ఉధృతంగానో
కురిసే వాన
మా వూర్లో మా ఇంటిముందు
అలుకు చల్లినట్లు వాకిలిని తడిపి
అందమయిన ముగ్గేయడానికి
వేదికను సిద్ధం చేస్తుంది
అంతే ప్రేమతో అదే వాన
మా పెరట్లోనూ కురుస్తుంది
తోటలోని మొక్కలన్నీ సంతోషంతో
ఊగిపోయి విరబూస్తాయి విరగకాస్తాయి
అదే వాన మీ మహానగరంలోనూ కురుస్తుంది
వాకిల్లే లేని మీ భవంతుల ముందు
టపటపా కురిసి గబాగబా
ఏ మ్యాన్ హోల్లోకో, మోరీలోకో
జారిపోతుంది
అదే వాన పెరడే లేని మీ భవనం
మీదా కురుస్తుంది
కానీ
మీ బాల్కనీలో మీరు అందంగా అమర్చిన
కుండీల్లోని మొక్కలు
తమ చిన్నిచిన్ని కొమ్మల్ని
చేతుల్లా సాచి
అందని చినుకులకేసి ఎంతో దీనంగా
విచారంగా చూస్తాయి
వానేమో చినుకుల్ని దులిపేసుకుని
నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.
వారాల ఆనంద్, 9440501281