calender_icon.png 31 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్ష బీభత్సం

02-08-2024 01:43:14 AM

  1. ఉత్తర భారత్‌ను ముంచెత్తిన వరద
  2. 24 గంటల్లో 32మంది మృతి
  3. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు
  4. ఢిల్లీలో 108 మి.మీ రికార్డు స్థాయి వర్షం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 1: ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వరదల కారణంగా ఏడు రా్రష్ట్రాల్లో గడిచిన 24గంటల్లో దాదాపు 32మంది మరణించారు. దేశరాజధాని ఢిల్లీలో జూలైలో ఒకేరోజులో గత 14ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ఇక్కడ వరదల కారణంగా ఐదుమంది మరణించారు. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

అండర్‌పాస్‌లు పూర్తిగా మునిగిపోయాయి. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌కు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలో చిక్కుకొని 14 మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. బీహార్‌లోని రెండు జిల్లాల్లో పిడుగుపాటుకు 5మంది మరణించారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్తార్‌లోని దచన్ ప్రాంతంలో వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. రాజౌరి జిల్లాలోని నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్ నోయిడాలో ఇద్దరు, హర్యానాలో ముగ్గురు వరదల్లో చిక్కుకొని చనిపోయారు.  

మరణంలోనూ తోడుగా..

ఢిల్లీలో కురుస్తున్న వర్షాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. మూడేళ్లు కూడా నిండని ఓ పసివాడు తల్లితో సహా మురుగుకాల్వలో పడి చనిపోయాడు. ఢిల్లీకి చెందిన తనూజ బిష్త్.. తన కుమారుడితో కలిసి గురువారం కూరగాలు కొనేందకని ఇంటినుంచి బయటకు వచ్చింది. ఇంటికి తిరిగివస్తుండగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్డుపైన ఉన్న మురుగు కాలువను గమనించని ఆ తల్లి.. బిడ్డతో సహా కాల్వలో పడిపోయింది.  కొన్నిగంటల తర్వాత దాదాపు అరకిలోమీటర్ దూరంలో వారిద్దరూ విగతజీవులుగా కనిపించారు. అయితే మరణంలోనూ బిడ్డ చేతిని వదలకుండా ఆ  తల్లి పట్టుకుని ఉండటాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. వరదలు అరికట్టడంలో ఢిల్లీ మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.