వానకు
వాళ్ళంటే మోహమో
వాళ్ళకు వానంటే చచ్చేంత దాహమో
అంచనా వేయడం ఎవరితరం.
మట్టి కాగితంపై
నాగలి కర్రుతో గీతలు కొడుతూ
ఆకుపచ్చని కావ్యానికి శ్రీకారం చుడతారు.
తొడుగుల్లేని పాదాలతో
బురదను ముద్దాడుతూ
జోరువానలో
మెరుపు తీగల్లా పొలమంతా తిరుగుతారు.
వీళ్ళ చేతివేళ్ళ చివర
వనాలేవో నిక్షిప్తమై ఉంటాయనుకుంటా
నేలను తాకిన తావుల్లో ఆకుపచ్చని కలలు
నిద్దుర లేస్తాయి.
వాన వాళ్ళు పురా దోస్తులు
ఒకళ్ళ భుజాలపై మరొకళ్ళు
చేతులు వేసుకొని ఋతువంతా తిరుగుతారు.
వానరంగు మనుషులు
వారి దేహం నిండా
రక్తమాంసాలకు బదులు
పంటలు, కాలవలు ఉంటాయి
ఉరుములు మెరుపులు
వారి ఉచ్చ్వాస నిశ్వాసాలు
మేఘాలు లాంటివారు
కురవడమే తప్ప
ఒట్టిపోవడం ఎరుగని వారు.