calender_icon.png 14 March, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేశాఖ లాభాపేక్షను మానాలి

19-02-2025 12:00:00 AM

ఇటీవల న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణించడం అత్యంత విషాదకరం. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైళ్ళలో ప్రయాణిస్తూ ప్రయాగరాజ్ వెళ్తున్నారు. న్యూఢిల్లీ స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవగాహన రాహిత్యం, నిర్లక్ష్య వైఖరి, ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వంటి మానవ తప్పిదాలే అంతటి దుర్ఘటనకు కారణమని చెప్పక తప్పదు. మరణించిన లేదా తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్హతలనుబట్టి బాధిత కుటుంబీకులకు రైల్వేశాఖలో శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. ప్లాట్‌ఫార్మ్‌ల నెంబర్లు మార్చినట్టు ప్రకటనలు చేయడం, ఒకటే పేరుతో రెండు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడం.. ఈ దుస్థితికి మూల కారణమని రైల్వేశాఖ ప్రాథమికంగా వెల్లడించింది. ప్రతి గంటకు 1500 జనరల్ టికెట్లు అమ్మినట్లు చెబుతున్నారు.

ప్యాసింజర్ రైళ్ళలోని రెండు లేదా మూడు జనరల్ బోగీల కోసం అంతపెద్ద సంఖ్యలో టికెట్లు అమ్మడం క్షమించరాని నేరం. రైల్వేశాఖ లాభాపేక్షను వదిలి మానవీయ కోణాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం ఆ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సంపన్న వర్గాలకే ఉపయోగంగా ఉంటున్నాయి. పై దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా, సాధ్యమైనంత త్వరగా శిక్షించినప్పుడే ఇలాంటివి పునరావృతం కావు. కాగా, ఇప్పటికే కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 53 కోట్లు దాటినట్లు వార్తలు వచ్చాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగాల్సిన పుణ్యదినాలను మరో రెండు రోజులు పొడిగిస్తారని అంటున్నారు. ఇది అనవసరం. 

 -దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్ 


విగ్రహం తిరిగి నెలకొల్పండి

అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంతాలకు అతీతుడు. తెలంగాణ రాష్ట్ర సచివాలయ రహదారి సుందరీకరణలో భాగంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని తొలగించారు. సుందరీకరణ పూర్తయినా దానిని తిరిగి నెలకొల్పలేదు.  పొట్టి శ్రీరాములు నిష్కళంక దేశ భక్తుడు. అంటరానితనం నిర్మూలనకు అనేక నిరాహారదీక్షలు చేసి నిమ్న వర్గాలకు దేవాలయ ప్రవేశాలు కల్పించారు. ఆయన బలిదానం వల్లే దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తొలగించిన ఆయన విగ్రహాన్ని రాష్ట్ర యంత్రాంగం తిరిగి నెలకొల్పాలి. అదే ఆయనకు మనమిచ్చే నివాళి.

 -కప్పగంతుల వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్