17-04-2025 02:51:08 PM
సబ్ వే నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్..
పనులకు రూ.4.28 కోట్లు మంజూరు..
నిర్మాణ పనులకు టెండర్ల పిలుపు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ కు సమీపంలో తేలికపాటి వాహనాలు, పాదాచారులు రైల్వే ట్రాక్ దాటేందుకు లిమిటెడ్ హైట్ సబ్ వే (ఎల్ హెచ్ ఎస్) నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులతో సబ్ వే నిర్మాణ పనులు చేపట్టడానికి రైల్వే శాఖ ఈ నెల 10న కాంట్రాక్టర్ ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. దీనితో ఎట్టకేలకు కేసముద్రం పట్టణ ప్రజలకు ఏళ్ల తరబడిగా ఉన్న రైల్వే ట్రాక్ దాటే సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. గతంలో రైల్వే గేట్ ఉన్న 421/33 -35 కిలోమీటర్ వద్ద సబ్ వే నిర్మాణం చేపట్టనున్నారు. 3/2.65 మీటర్ల ఎత్తు వెడల్పుతో ఆర్ సీ సీ బాక్స్ నిర్మించి ఎయిర్ పుషింగ్ విధానం ద్వారా సబ్ వే ఏర్పాటు చేయనున్నారు.
గతంలో ఇక్కడ ఉన్న రైల్వే గేట్ తొలగించి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం వల్ల రైల్వే ట్రాక్ దాటేందుకు పట్టణ ప్రజలు, ద్విచక్ర, తేలికపాటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయగా, ఎట్టకేలకు రైల్వే శాఖ స్పందించి నిధులు విడుదల చేయడంతో పాటు పనుల నిర్వహణకు టెండర్లు పిలవడం పట్ల మహబూబాబాద్ జిల్లా బిజెపి కోశాధికారి ఓలం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. టెండర్లు ఖరారు చేసిన తర్వాత 9 నెలల్లో కేసముద్రం రైల్వే ట్రాక్ వద్ద సబ్ వే నిర్మాణ పనులు పూర్తి చేయడానికి రైల్వే శాఖ గడువు విధించిందని చెప్పారు. కేసముద్రం పట్టణంలో సబ్ వే నిర్మాణానికి సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రైల్వే శాఖ మంత్రి వైష్ణవి అశ్విన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.