calender_icon.png 13 February, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడి నుంచైనా రైల్వే టికెట్

03-05-2024 01:38:07 AM

యూటీఎస్ యాప్‌తో అందుబాటులోకి

కొనుగోలు దూర పరిమితిని ఎత్తేసిన రైల్వే శాఖ

స్టేషన్ వద్ద 15 మీటర్ల దూర పరిమితి ఆంక్షల సడలింపు

అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికులకు తీరనున్న కష్టాలు

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి తదితర రద్దీ స్టేషన్లలో ఒకప్పుడు అన్ రిజర్వ్‌డ్ రైల్వే టికెట్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఈ ఆఫ్‌లైన్ టికెట్ల సమస్యతో ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడేవారు. దీంతో రైల్వే శాఖ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రయాణికుల కష్టాలు తీర్చింది. అందులో భాగంగానే 2014లో ముంబయి సబర్బన్ ఏరియాలో యూటీఎస్ (UTS) పేరిట రైల్వే శాఖ ఓ ఉచిత మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్లలో పనిచేసే ఈ యాప్ ద్వారా సాధారణ రైల్వే ప్రయాణికులు (రిజర్వేషన్ లేని ప్రయాణికులు) రైల్వే స్టేషన్‌లో క్యూలో నిలబడి టికెట్ తీసుకునే సమస్య తీరింది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్లే కాకుండా ప్లాట్‌ఫాం టికెట్లు కూడా తీసుకోవచ్చు. ముంబయిలో విజయవంతం అయిన ఈ యాప్‌ను  1 నవంబర్ 2018లో రైల్వే శాఖ దేశమంతా విస్తరించింది. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్లు తీసుకునేందుకు, క్యూ ఇక్కట్లకు చెక్ చెప్పేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఈ యాప్ ద్వారా ఇటీవలి వరకు ఉన్న కొన్ని పరిమితులను రైల్వే శాఖ ఎత్తేయడం, మరికొన్నింటిని మార్చడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యంగా మారనుంది.  

గతంలో స్టేషన్ నుంచి 15 మీటర్ల లోపున...

యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు మొబైల్ ఫోన్‌లో తమ జీపీఎస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. తాము ఏదైతే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తారో ఆ స్టేషన్ నుంచి సుమారు 15 మీటర్ల దూరం వెళ్తే మాత్రం టికెట్ బుక్ అయ్యేది. పొరపాటున అంతకు తక్కువ దూరం నుంచి టికెట్ బుక్ చేయాలని ప్రయత్నిస్తే.. మీరు నిర్ణీత దూరం కంటే తక్కువ దూరంలో ఉన్నారని, ఇంకా దూరం వెళ్లి ప్రయత్నించాలని వచ్చేది. ఫలితంగా స్టేషన్ సమీపంలో నుంచి టికెట్ బుకింగ్‌కు ఇబ్బంది అయ్యేది. ప్రయాణికుల ఫిర్యాదు నుంచి ఈ అంశాలను గమనించిన రైల్వే శాఖ యాప్‌లో అనేక మార్పులు చేసింది. ఫలితంగా ఇప్పుడు స్టేషన్ నుంచి కేవలం 5 మీటర్ల దూరం నుంచి టికెట్ తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. 

పరిమితి ఎత్తివేతతో..

యూటీఎస్ యాప్ ద్వారా గతంలో తాము ప్రయాణించాల్సిన స్టేషన్ పరిధిలో నిర్ణీత దూరం పరిమితి ఉండేది. సబర్బన్ స్టేషన్ల నుంచి 20 కి.మీ దూరం, రూరల్ స్టేషన్ల పరిధిలో 50 కి.మీ దూరం నుంచి అన్ రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ పరిమితిని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం ఏ స్టేషన్ నుంచైనా ఎక్కడికైనా అన్ రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.