- రాకపోకలు ప్రారంభం
- పునరుద్ధరణ తర్వాత పట్టాలెక్కిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్
- గురువారం నుంచి రైళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): భారీ వర్షాలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను అధికారులు పునరుద్ధరించారు. బుధవారం మధ్యాహ్నానికి తాడ్లపూసపల్లి మహబూబాబాద్ సెక్షన్‌లో డబుల్-లైన్ ట్రాక్‌ను పునరుద్ధరించగా, ఇంటికన్నె- కేసముద్రం సెక్షన్‌లో సింగిల్ లైన్ ట్రాక్ పునరుద్ధరణ పూర్తుంది. ఇదే సెక్షన్‌లోని మరో లైన్ పునరుద్ధరణ పనులు బుధవారం అర్ధరాత్రి నాటికి పూర్తి చేసి, గురువారం నుంచి పూర్తి స్థాయిలో రైళ్లను తిప్పేందుకు కసరత్తు చేస్తున్నారు. పునరుద్ధరణ అనంతరం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ మొదటగా ట్రాక్‌లను దాటింది.
52 గంటల శ్రమ
భారీ వర్షాలతో ఇంటికన్నె కేసముద్రం, తాడ్ల పూసపల్లి సెక్షన్‌లోని 15 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు దెబ్బ తిన్నాయి. వీటి పునరుద్ధరణకు మొత్తం 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, 5 వేల క్యూ.మీ. బలాస్ట్, 6 వేల క్యూ.మీ. కన్సాలిడేషన్ మట్టిని ఉపయోగించారు. సుమారు 52 గంటల పాటు శ్రమించి ట్రాక్‌ను పునరుద్ధరించారు. బండరాళ్లు, ఇసుక సంచులతో ప్రత్యేక రైలును ఘటనా స్థలికి తీసుకువెళ్లి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. దాదాపు 400 మంది కార్మికులు పనుల్లో పాల్గొన్నారు. అప్‌లైన్‌లో పునరుద్ధరణ పను లు బుధవారం ఉదయమే పూర్తయ్యాయి.
ట్రాక్ తనిఖీ కోసం ప్రయాణికులు లేకుండా ఆగిన సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ ఖాళీ రైలును ఇంటికన్నె కేసముద్రం సెక్షన్‌లోని అప్-లైన్‌లో నడిపారు. ట్రాక్ రైలు రాకపోకలకు అనుగుణంగా ఉందని అధికారులు ప్రకటించారు. తాడ్ల పూసపల్లి మహబూబాబాద్ సెక్షన్ అప్ అండ్ డౌన్ లైన్లలో నష్టం వాటిల్లిన మొత్తం 8 చోట్ల బుధవారం సాయం త్రం నాటికి విజయవంతంగా పునరుద్ధరించారు.
ప్రయాణికుల సహకారం గొప్పది
ప్రకృతి విపత్తుల సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రయాణికులు సహ కరించడం గొప్ప విషయమని ద.మ. రైల్వే జోన్ జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భారీ వర్షాల కారణంగా ట్రాక్ గాలిలో తేలియాడిన పరిస్థితిని గమనించి అర్ధరాత్రి సమచారం అందించి ఎలాంటి ఘటనలు జరగకుండా చూసిన పెట్రోలింగ్ సిబ్బందిని ఆయన కొనియాడారు.
563కు చేరిన రద్దయిన రైళ్ల సంఖ్య
కాజీపేట విజయవాడ మార్గంలో మంగళవారం పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 563 రైళ్లు రద్దయ్యాయి. 185 రైళ్లను దారి మళ్లించారు. బుధవారం ట్రాక్ అందుబాటులోకి వచ్చినా అప్పటికే పెద్ద ఎత్తున రైళ్లు రద్దున నేపథ్యంలో దశలవారీగా పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మచిలీపట్నం బీదర్, విశాఖ నాందేడ్, విజయవాడఱు సికింద్రాబాద్, లింగంపల్లి కాకినాడ పోర్ట్, సికింద్రాబాద్. దర్బంగా తదితర రైళ్లను రద్దు చేయగా, చెన్నై సెంట్రల్ ఖాత్రా, అహ్మదాబాద్ చెన్నై, త్రివేండ్రం నిజాముద్దీన్ తదితర రైళ్లను కాజీపేట విజయవాడ లైన్లో తిరిగి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను నల్గొండ మీదుగా నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.