పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల మీదుగా వెళ్తున్న రైలు
- ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా
పెద్దపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రోజుల క్రితం గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. గురువారం ఉదయం నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్లకు లైన్ క్లియర్ చేశారు. లోకల్ రైళ్లను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.
ప్రమాదం జరిగిన వెంట పట్టాలు చెల్లా చెదురు కావడంతో అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. అత్యవసర సర్వీసు రైళ్లను మాత్రం దారి మళ్లించారు. అయితే అధికారులు వెంటనే రంగంలోకి దిగి సింగరేణి సహకారంతో రైల్వే ట్రాక్ లైన్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టి 48 గంటల్లోనే పూర్తి చేశారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా రెండు రోజులుగా సంఘటన స్థలంలోనే ఉండి పనులను వేగవంతం చేయించారు.
ఈ రైలు ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు పోస్టుమార్టం చేస్తున్నారు. గూడ్స్ రైలు ప్రమాదంతో రైల్వే శాఖకు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అధిక లోడుతో వస్తున్న కారణంగా ప్రమాదం జరిగిందా, లేక ఇతర కారణమేమైనా ఉందా అన్న కోణంలో రైల్వే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.