- ప్రయాణికుల భద్రతలో ఆర్‌పీఎఫ్‌ది కీలక పాత్ర
ఏడాది కాలంలో ద.మ రైల్వే పరిధిలో విశిష్ట సేవలు
1,385 మంది బాలలను కాపాడిన సిబ్బంది
రైళ్లలో 2౦ క్వింటాళ్లకు పైగా గంజాయి స్వాధీనం
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): రైల్వే ఆస్తుల పరిరక్షణతో పాటు రైళ్లలో మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) విభాగం సమర్థంగా పనిచేస్తున్నది. అంతేకాదు.. తప్పిపోయిన లేదా ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను తల్లిదండ్రుల దరికి చేరుస్తున్నది. ప్రయాణికుల సొత్తును దోచిన నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నది. ఆర్‌పీఎఫ్, ద.మ రైల్వే, ఐజీ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్ నేతృత్వంలో 2024లో అధికారులు, సిబ్బంది ఎన్నో విజయాలు సాధించారు.
ఏడాదిలో సాధించిన విజయాలు..
‘ఆపరేషన్ రైల్ సురక్ష’లో భాగంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది 367 కేసుల్లో 674 మంది నేరస్థులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.83,31,184 విలువైన రైల్వే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫుట్‌బోర్డ్‌లు, మహిళలు, వికలాంగుల కంపార్ట్‌మెంట్ల ప్రయాణిం చిన వారు, అనధికారికంగా ప్రయాణం సాగించిన 68,746 మందిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి కోర్ట్ ఆర్డర్‌తో రూ.1,30,77,885 జరిమానా వసూలు చేశారు.
‘ఆపరేషన్ యాత్రీ సురక్ష’లో భాగంగా 460 మంది నేరస్థులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.17 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని, వారిపై 500 కేసులు నమోదు చేశారు. ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే’లో భాగంగా ఇంటి నుంచి తప్పిపోయిన, లేదా పారిపోయిన 1,385 మంది (వీరిలో 240 మంది బాలికలు) బాలలను గుర్తించారు. తర్వాత వారిని తల్లితండ్రులకు అప్పగించారు.
‘ఆపరేషన్ ఆహ్ట్’లో భాగంగా 264 మంది మానవ అక్రమ రవాణాదారుల బారి నుండి 476 మంది బాలలు, 15 మంది బాలికలను రక్షించారు. రైళ్లలో మాదక ద్రవ్యా ల రవాణాను అరికట్టేందుకు అమలైన ‘ఆపరేషన్ నార్కోస్’ కింద 111 కేసులు నమోదు చేశారు.
127 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5,02,33,060 విలువ చేసే 2,311 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఆపరేషన్ అమానత్’లో భాగంగా 2,576 సందర్భాల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న రూ.6,93,48,568 విలువైన వస్తువులను సేకరించి, తిరిగి బాధితులకు అప్పగించారు.
ప్రయాణికుల భద్రతే మా ప్రథమ కర్తవ్యం
ప్రయాణికుల భద్రతే మా ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నేరవేర్చేందుకు ఆర్‌పీఎఫ్ నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నది. ఆర్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది పనితీరు ఎంతో గొప్పగా ఉంది. మానవ అక్రమ రవాణా నివారణలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయిన, లేదా తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని తల్లిదండ్రులకు అప్పగించడంలోనూ ముందంజలో ఉన్నారు.
అరుణ్‌కుమార్ జైన్, జీఎం, ద.మ.రైల్వే