calender_icon.png 20 October, 2024 | 3:06 AM

రైల్వే అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకే

18-10-2024 02:43:48 AM

120 నుంచి తగ్గించిన ఐఆర్‌సీటీసీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణికులకు 120 రోజుల ముందుగా తమ ప్రయాణాలను రిజర్వ్ చేసుకొనే సదుపాయం ఉండగా తాజాగా దాన్ని 60 రోజులకు తగ్గించింది. గతంలో రైల్వే ముందస్తు బుకింగ్ ప్రయణానికి 60 రోజుల ముందే ఉండేది. దాన్ని 120 రోజులకు పెంచిన భారతీయ రైల్వే.. తాజాగా గతంలో ఉన్న వ్యవధికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

2024, నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అక్టోబర్ 31 వరకు ఉన్న బుకింగ్స్‌కు సంబంధించి పాత నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది. కాగా గోమతి, తాజ్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎలాంటి మా ర్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్‌కు తక్కువ వ్యవధి ఉంది.

విదేశీ పర్యాటకులకు మాత్రం 365 రోజుల ముందే టికెట్ బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండగా ఇందులో మార్పు చే యలేదు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ షేర్ విలువ 2 శాతం మేర క్షీణించి రూ.873 వద్ద కొనసాగుతున్నది. గడువు కుదింపు వల్ల ఆ మేర క్యాన్సిలేషన్లు తగ్గి ఐఆర్‌సీటీసీకి ఆదా యం తగ్గే అవకాశం ఉండటమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.