- దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు మద్దతు
- విదేశీ గడ్డపై భారత్‌ను కించ పరిచేలా వ్యాఖ్యలు
- దేశాన్ని విభజించే కుట్రలో కాంగ్రెస్ భాగస్వామి
- రాహులాగాంధీపై ధ్వజమెత్తిన అమిత్ షా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అరోపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దేశాన్ని విభజించేందుకు కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో రాహుల్‌గాంధీ భాగస్వామి అవుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ల వ్యతిరేక అజెండాకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతం? రాహుల్ ప్రతిసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. తద్వారా భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాహుల్ ఉద్దేశం నెరవేరదు
ప్రాంతీయవాదం, మతం, భాషపరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ అమెరికాలో ప్రకటించారని అమిత్ షా మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరోపణలను వ్యతిరేకిస్తూ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయదని స్పష్టం చేశారు. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని, అలాగే దేశ భద్రతతో ఎవరూ ఆటలాడలేరని తేల్చిచెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విదేశీ గడ్డపై రాహుల్ దేశాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలు దేశ భద్రతను ముప్పులో పడేసేలా ఉన్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు సైతం దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయవాదం, మతం, భాష తదితర వేర్పాటువాదాలను ప్రస్తావించి దేశంలో చీలికలు తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని, రాహుల్‌గాంధీ అమెరికాలో చేసిన ప్రకటన ఈ విషయాన్ని బయటపెట్టిందని అన్నారు.
రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యతిరేకత
దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి తద్వారా కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తెచ్చారని షా ఆరోపించారు. రాహుల్ మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటికి వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీకి ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని, తాము అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రతతోనూ ఎవరూ ఆటలు ఆడలేరని తేల్చి చెప్పారు.