- రాయ్‌బరేలీ సెలూన్ యజమానికి కాంగ్రెస్ ఎంపీ సర్‌ప్రైజ్
- ఎన్నికల ప్రచారంలో అతని వద్ద కటింగ్ చేయించుకున్న రాహుల్
- దానికి గుర్తుగా సెలూన్ సామగ్రి బహుమతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: యూపీలోని రాయ్‌బరేలీ జిల్లా లాల్‌గంజ్‌లోని సెలూన్ నిర్వాహకుడు మిథున్‌కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రత్యేక బహుమతి పంపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 13 బైశ్వారా ఇంటర్ కాలేజీలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మిథున్ సెలూన్‌కు వెళ్లి కటింగ్, షేవింగ్ చేయించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌గాంధీ.. షాంపూ కుర్చీ, రెండు హెయిర్ కటింగ్ కుర్చీలు, ఇన్వర్టర్ బ్యాటరీని పంపారు. వీటిని కాంగ్రెస్ కార్యకర్తలు మిథున్‌కు అందజేశారు. ఈ బహుమతులను స్వీకరించిన మిథున్.. రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపాడు. దేశంలోని అంత పెద్ద నాయకుడు తన సెలూన్‌లో గడ్డం, జుట్టు కత్తిరించుకోవడం తనకు చాలా పెద్ద విషయమని మిథున్ పేర్కొన్నాడు. ఇది తన జీవితంలో ఊహించని ఘటన అని, రాహుల్ బహుమతులు పంపడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.