28-03-2025 12:15:12 AM
సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆరోపణ
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన స్వరాన్ని రెట్టింపు చేశారు. మాట్లాడేందుకు తనను అనుమతించరని, వాళ్లు దేనికి భయపడుతున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ‘మాట్లాడేందుకు నన్ను అనుమతించరు. వాళ్లు దేనికి భయపడుతున్నారో నాకు తెలియడం లేదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు తనకు సభలో మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదని రాహుల్ ఆరోపించారు. ‘ప్రధాని కుంభమేళాపై మాట్లాడారు. నేను దానిపై మాట్లాడాలనుకున్నా.
కుంభమేళా చాలా బాగుందని చెప్పాలనుకున్నా. అలాగే నిరుద్యోగ సమస్యపై మాట్లాడదామనుకున్నా. కానీ మాట్లాడేందుకు నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ నిజం ఏంటంటే మాట్లాడటానికి మాకు అనుమతి లేదు’ అని పేర్కొన్నారు. అలాగే తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పుడల్లా స్పీకర్ పారిపోతున్నారన్నారు. సభను నడిపే విధానం ఇది కాదన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్న రాహుల్.. సభలో ప్రజాస్వామ్యానికి కాకుండా కేవలం ప్రభుత్వానికే చోటు ఉందని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ రాహుల్‌తోపాటు ప్రతిపక్షాలు పార్లమెంటరీ మర్యాదను కాపాడాలని సూచించారు.