calender_icon.png 18 January, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు

07-07-2024 01:40:17 AM

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసి, ఇంకో చేత్తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కరచాలనం చేశాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న సందర్భంగా శనివారం రాహుల్‌గాంధీకి నిరంజన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను రక్షించడం, గౌరవించడం తమ బాధ్యత అని రాహుల్ అన్నారని, రాజీవ్ హయాంలో తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లాను మ్యాండేటరీగా చేస్తాం, పటిష్టం చేస్తామని చెప్పిన మాటలు విస్మరించారని మండిపడ్డారు.

రాజ్యాంగాన్ని రాహుల్ అపహాస్యం చేస్తున్నారని, రాజకీయ విలువలు, ధర్మసూత్రాలకు రాహుల్ కట్టుబడి ఉంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించాలని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేశవరావుతో రాజీనామా చేయించినట్టు పార్టీలో చేరిన వాళ్లు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహించారు. ఆయన మాటలన్నీ డబుల్ స్టాండర్డ్ అని దేశం భావించదా, నాగరికుడిగా, ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. తాము సుందర భారత్ నిర్మిస్తామని చెప్పారని, ఆయన నోటి నుంచి చెప్పిన ప్రకారం తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు దిక్కులేదని ఎద్దేవాచేశారు. సర్వోన్నత న్యాయస్థానం మీద నమ్మకం ఉందని పేర్కొన్న రాహుల్.. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా పార్టీ మారిన వారి సభ్యత్వం రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ స్పీకర్‌ను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.