- మన్మోహన్ సింగ్ మరణంపైనా కాంగ్రెస్ రాజకీయం
- పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరపకుండా చేశారు
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి రాష్ర్ట ప్రభుత్వాలు 7 రోజు ల సంతాప దినాలు పాటిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మాత్రం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లాడ ని.. ఇలాంటి వ్యక్తి మన్మోహన్ మరణంపైనా రాజకీయం చేస్తున్నారని తెలంగాణ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు.
మన్మోహన్ సింగ్‌ను అడుగడుగునా అవమానించిన వ్యక్తులు ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇది ఆ పార్టీ సంస్కారానికి అద్దం పడుతున్నదని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావుని అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు నీతులు వల్లించడం సిగ్గుచేటని అన్నారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటని.. ఆర్థిక సంస్కరణలకు ఆయన పునాదులు వేశారని తెలిపారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా మాజీ ప్రధాని వాజ్‌పేయి తరహాలోనే అంత్యక్రియలు నిర్వహించామన్నారు. మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు.
మన్మోహన్‌ను కాదని విదేశీ వ్యవహారాలు నడిపారు..
2008లో బీజింగ్‌లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైతే అనేక దేశాల అధినేతలను, ప్రపంచస్థాయి నాయకులందరినీ ఒలింపిక్స్ కమిటీ ఆహ్వానించిందని.. కానీ భారత ప్రధానమంత్రికి ఆహ్వానం అందలేదని.. సోనియా గాంధీ, -రాహుల్ గాంధీకి ఆహ్వానాలు వచ్చాయని కిషన్ రెడ్డి అన్నారు.
చైనా ఒలింపిక్ క్రీడల సమయంలో విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోతో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశమయ్యారన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలిసి భారత్- మధ్య సమాచార మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకు న్నా రని ఆరోపించారు.
అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని దూరంగా పెట్టిన చరిత్ర నెహ్రూ కుటుంబానిదని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధా నిగా పదేళ్ల కాలంలో సాధించిన ప్రభుత్వ ఘనతలను సోనియా-రాహుల్ గాంధీ అకౌంట్‌లో వేసుకున్నారని.. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే మన్మోహన్ సింగ్‌పై నెట్టారని తెలిపారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో అందరికి తెలుసునని చెప్పారు. కాం గ్రెస్ పార్టీలో సాధారణ నాయకులకు దక్కిన గౌరవం కూడా పీవీకి దక్కకుండా తెలుగు బిడ్డను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
నెహ్రూయేతర కుటుంబాలకు సం బంధించిన వారు ప్రధానులులుగా, రాష్ర్టపతులుగా బాధ్యతలు నిర్వహించినా వారిపట్ల నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందన్నారు.
సోనియా బెదిరింపులతో..
మాజీ ప్రధాని పీవీ ఢిల్లీలో మరణిస్తే కాం గ్రెస్ పార్టీ సాధారణ నాయకులకు దక్కిన గౌరవాన్ని కూడా ఆయనకు దక్కకుండా అవమానపర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కిషన్ రెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీ బెదిరింపులతో పీవీ అంతిమ యాత్ర తర్వాత ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకుపోనివ్వలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పీవీ స్మారక కేంద్రాన్ని నిర్మించలేదని చెప్పా రు. అయితే ఆయనకు 2024లో భారతరత్న అవార్డు ఇచ్చి మోదీ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించిందన్నారు. పీవీకి భారతరత్న అవార్డు ఇస్తున్న సమయంలో కనీసం కాంగ్రెస్ నాయకులు ప్రశంచించిన పాపాన కూడా పోలేదని.. రాహుల్, సోనియా ఈ కార్యక్రమానికే గైర్హాజరయ్యారని అన్నారు.
మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ నాయకులు వచ్చినా ఎక్కడ సోనియా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందో అని కనీసం చప్పట్లు కూడా కొట్టలేదన్నారు. యూపీఏ పాలనలో దేశంలో అనేక రహదారులు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ పథకాలకు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పేర్లు మాత్రమే పెట్టారని గుర్తుచేశారు.
క్రీడలకు కూడా రాజీవ్ గాంధీ పేరిట ఖేల్ రత్న అవార్డులు ప్రకటించారని, శంషాబాద్ విమానా శ్రయానికి ఎన్టీఆర్ పేరుంటే తీసేసి మరీ రాజీవ్ గాంధీ పేరును పెట్టారని.. అది కాం గ్రెస్ పార్టీ తీరు అని విమర్శించారు.
ఈ ప్రెస్‌మీట్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వా యి హరీష్ బాబు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పార్టీ నేతలు ఎన్వీ సుభాష్, రాణీ రుద్రమ పాల్గొన్నారు.
షాడో ప్రైమ్ మినిస్టర్స్‌గా సోనియా, రాహుల్..
షాడో ప్రైమ్ మినిస్టర్స్‌గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రవర్తించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఓ ఆర్డినెన్స్ విషయంలో ప్రధానిని బక్వాస్ అని అన్న రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ గౌరవార్థం టెన్ జనపథ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విందును రాహుల్ గాంధీ ఎందుకు బహిష్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ తమ కనుసన్నల్లోనే పనిచేసేలా రాహుల్ గాంధీ, సోనియా వ్యవహరించారని దుయ్యబట్టారు.
మన్మోహన్‌ను పాక్ ప్రధాని విమర్శిస్తే.. మోడీ, అద్వానీ స్పందించారు కానీ కాంగ్రెస్ రియాక్ట్ కాలేదన్నారు. 2007లో ప్రధాని హోదాలో మన్మోహన్ 2జీ స్పెక్ట్రం వేలం వేయాలని టెలికాం మంత్రి ఏ. రాజాకు ఉత్తరం రాశారని.. కానీ మన్మోహన్ సింగ్ నిర్ణయానికి విరుద్ధంగా, సోనియా ఆదేశాలతో 2 జీ స్పెక్ట్రం కుంభకోణానికి తెరలేపారన్నారు..
చివరకు ఈ కుంభకోణలో టెలికాం మంత్రి ఏ.రాజా జైలుకెళ్లారని చెప్పారు. గతంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్‌ని అనేక రకాలుగా అవమానిచారని.. ఆరోజు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ ఖండించలేదని.. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ షరీఫ్ వ్యాఖ్యలను ఖండించారన్నారు.