calender_icon.png 23 September, 2024 | 7:52 AM

రాహుల్ భారత్ వ్యతిరేకి!

23-09-2024 02:14:09 AM

అనురాగ్ ఠాకూర్

శ్రీనగర్, సెప్టెంబర్ 22: ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళ్లినప్పుడు 140 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధిగా వ్యవహరిస్తుండగా, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని మోదీని, భారతదేశాన్ని వ్యతిరేకించడమే పనిగా పనిచేస్తున్నారని ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాహుల్  ప్రవర్తనను భారతీయులు ఎప్పటికీ ఆమోదించరని స్పష్టం చేశారు. ఆదివారం శ్రీనగర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ, రాహుల్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు.

కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతోందని దుయ్యబట్టారు. రాహుల్ యూఎస్ పర్యటనలో భారతదేశాన్ని వ్యతిరేకించడమే కాకుండా, భారత వ్యతిరేక భావజాలాలున్న అమెరికన్ ఎంపీతో భేటీ అయ్యారన్నారు. ఈ విషయమై రాహుల్ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం, కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కూటమి ప్రయత్నిస్తున్నాయన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపైనా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇది జరిగే పని కాదన్నారు. కాగా ప్రధాని మోదీ ఆదివారం న్యూయార్క్‌లో పర్యటిస్తుండగా, దీన్ని వ్యతిరేకిస్తూ ‘కోయలిషన్ ఫర్ రీక్లెయిమింగ్ డెమోక్రసీ ఆన్ ఇండియా’ అనే సంస్థ పోస్టర్లు అంటించింది. ఈ చర్యపైనా ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.